Top 6 News @ 6 PM: మోదీ సామాజికవర్గంపై రేవంత్ రెడ్డి సంచలనం
కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 56.33 శాతంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు
1.మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ: రేవంత్ రెడ్డి
కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 56.33 శాతంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సమగ్ర సర్వే చేసి వివరాలు వెల్లడించని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కులగణన సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని ఆయన అన్నారు. కులగణన సర్వేను తప్పుపడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారని ఆయన అన్నారు. మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని ఆయన ఆరోపించారు.గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన కులాన్ని బీసీ జాబితాలో కలిపారని ఆయన చెప్పారు. తాను ఆఖరి రెడ్డి సీఎం అయినా ఫర్వాలేదని ఆయన అన్నారు. డబ్బుతోనే గెలిచేది ఉంటే కేసీఆర్ కు వంద సీట్లు వచ్చి ఉండేవన్నారు. కేసీఆర్ లారీల్లో డబ్బులు తరలించినా బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించారన్నారు. ప్రజల్లో ఉండి సమస్యపై పోరాడితేనే ఆదరణ వస్తోందన్నారు. కులగణన సర్వే పవర్ పాయింట్ ప్రజేంటేషన్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2.అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి: నిందితుడిపై చర్యలకు చంద్రబాబు ఆదేశం
అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో యువతిపై శుక్రవారం యాసిడ్ దాడి జరిగింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం బెంగుళూరుకు తరలించారు. పట్టణంలోని అమ్మచెరువుమెట్టకు చెందిన గణేశ్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశారు. యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గణేశ్ ఆమెపై యాసిడ్ పోసి కత్తితో దాడి చేశారు. బాధితురాలి కేకలు విని నిందితుడు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.
3.విజయ్ కు వై ప్లస్ భద్రత
తమిళ వెట్రి కళగం చీఫ్, విజయ్ కు వై ప్లస్ భద్రతను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో విజయ్ కు భద్రతను కల్పిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 11 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా విజయ్ కు భద్రత కల్పిస్తారు. ఇద్దరు నుంచి నలుగురు కమాండోలు, మిగిలినవారు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
4.వల్లభనేని వంశీని కస్టడీ కోరుతాం: విజయవాడ సీపీ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీకి తీసుకుంటామని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు చెప్పారు. ఈ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. గురువారం తెల్లవారుజాము వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి ఆయనను జడ్జి ఇంటి ముందు హాజరుపర్చారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు మేజిస్ట్రేట్.
5.తప్పులను ప్రశ్నిస్తే నాపై దుష్ప్రచారం: మంచు మనోజ్
పది మందికి సాయం చేయడం కోసం విద్యా సంస్థల్ని నాన్న ప్రారంభించారని మంచు మనోజ్ చెప్పారు. ఈ విద్యా సంస్థలు ప్రస్తుతంఎవరి చేతుల్లో ఉన్నాయో అందరికీ తెలుసునన్నారు. చిత్తూరులోని మోహన్ బాబు విద్యా సంస్థల సమీపంలోని రెస్టారెంట్ పై దాడిని మనోజ్ ఖండించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడ జరుగుతున్న విషయాలపై కొందరు విద్యార్థులు తనకు లేఖలు రాశారని ఆయన చెప్పారు. దీనిపై ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాతే తనపై అభాండాలు వేస్తున్నారని ఆయన విమర్శించారు.
6.ట్రంప్-మోదీ ప్రకటనపై పాక్ అభ్యంతరం
సీమాంతర ఉగ్రవాదంపై భారత్ అమెరికా సంయుక్త ప్రకటన ఏకపక్షమని పాకిస్తాన్ అభ్యంతరం తెలిపింది. సీమాంతర ఉగ్రవాదానికి తన భూభాగం వాడుకోకుండా పాక్ చూసుకోవాలని ట్రంప్, మోదీ సంయుక్త ప్రకటనపై పాక్ అభ్యంతరం తెలిపింది. ఈ ప్రకటన ఏకపక్షమని తెలిపింది. తహవూర్ రాణా అప్పగింతకు ట్రంప్ కార్యవర్గం అనుమతించింది.