Manipur Incident: మణిపూర్ ఘటనపై రాజకీయ రగడ.. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల ఆగ్రహం
Manipur Incident: వీడియోలు వైరల్ కావడంతోనే ప్రధాని స్పందించారు
Manipur Incident: మణిపూర్ ఘటనపై రాజకీయ రగడ.. కేంద్ర ప్రభుత్వం విపక్షాల ఆగ్రహం
Manipur Incident: మణిపూర్ హింసాకాండ రాజకీయ రగడకు కారణమవుతోంది. రెండు నెలల క్రితం ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యామాల్లో వైరల్‌గా మారడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. మణిపూర్‌లో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా.. కేంద్రం మౌనం వహిస్తుందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నాయి. పార్లమెంట్ వర్షకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ఇదే అంశంపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఘటనపై ప్రధాని మోడీ స్పందించినా.. విపక్షాలు పట్టువీడటం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఈ ఘటనే నిదర్శనమంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి. వీడియోలు వైరల్ కావడంతోనే ప్రధాని స్పందించారని... లేకపోతే స్పందించకపోయి ఉండేవారని అభిప్రాయపడ్డారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. మణిపూర్‌లో మారణహోమం జరుగుతోందన్నారు. ఘటనకు మణిపూర్ సీఎం బాధ్యత వహించి రాజీమానా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలన్నారు.
ఇటు కమ్యునిస్టు పార్టీలు సైతం ఈ ఘటనపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మే 4న ఘటన జరిగితే ఇన్ని రోజులు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయిని బృందా కారత్ ప్రశ్నించారు. ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటనకు ఎవరికి జవాబుదారీ? అంటూ ప్రశ్నించారు. ప్రధాని, కేంద్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. మణిపూర్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం హోం మంత్రిని దేశం మొత్తం బాధ్యులను చేస్తుందని బృందా కారత్ ధ్వజమెత్తారు.