ఇవాళ వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్
Modi: మోడీ నామినేషన్‌కు భారీ ఏర్పాట్లు
ఇవాళ వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్
Modi: ప్రధాని మోడీ ఇవాళ యూపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామపత్రాల దాఖలు సందర్భంగా భారీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వారణాసిలో మోడీ రోడ్‌షోకు కమలదళం ఏర్పాట్లు చేసింది. ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి పర్యవేక్షించారు. బీజేపీ సీనియర్ నేత సునీల్ బన్సల్ చాలా రోజుల నుంచి అక్కడే ఉండి పనులను చక్కబెట్టారు. నామినేషన్ కార్యక్రమానికి పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.
నామినేషన్ ప్రక్రియ సందర్భంగా కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ప్రధాని మోడీ సందర్శించనున్నారు. బనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. పీఎం మోడీ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ మిత్రులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నిన్నే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారణాసికి చేరుకోగా...చంద్రబాబు సైతం నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ భారీ మెజార్టీతో గెలిచారు. 2014లో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ప్రధాని గెలుపొందారు. 2019లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్‌పై 4 లక్షల 70 వేల పై చిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రధానికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ పోటీలో ఉన్నారు.