Pakistani Diplomat: భారత్‌లో దాడులకు కుట్రలు.. పాక్ దౌత్యవేత్తకు ఎన్‌ఐఏ కోర్టు సమన్లు
Pakistani Diplomat: పాకిస్థాన్ దౌత్యవేత్త అమీర్ జుబేర్ సిద్ధిఖీకి చెన్నై ఎన్ఐఏ కోర్టు సమన్లు జారీ చేసింది.
Pakistani Diplomat: పాకిస్థాన్ దౌత్యవేత్త అమీర్ జుబేర్ సిద్ధిఖీకి చెన్నై ఎన్ఐఏ కోర్టు సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా అతడిని విచారణకు పిలిచింది. భారత్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్లపై దాడులకు కుట్రపన్నారని సమన్లలో పేర్కొన్నారు. కరాచీలోని సిద్ధిఖీ అడ్రస్‌ను సమన్లలో ప్రస్తావించారు. రికార్డుల ప్రకారం శ్రీలంకలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో వీసా కౌన్సిలర్‌గా సిద్ధిఖీ విధులు నిర్వర్తించాడు. 2018లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాంటెడ్ జాబితాలో చేర్చారు. బాస్ అనే నిక్ నేమ్‌తో సిద్ధిఖీ చెలామణి అవుతున్నట్లు విచారణ అధికారులు గుర్తించారు.
2009-2016 మధ్య శ్రీలంకలో పనిచేస్తున్నపుడు గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనేవారితో సంబంధాలున్నాయని అధికారుల విచారణలో వెల్లడైంది. 2014లోనే సిద్ధిఖీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భారత్‌లో విధ‌్వంసం సృష్టించాలని వ్యూహరచనలో సిద్ధిఖీ కీలక పాత్రదారుడని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అప్పట్లో సిద్ధిఖీ ఆదేశాలతో భారత్ వచ్చిన శ్రీ లంక జాతీయుడు మహ్మద్ సఖీర్ హుస్సేన్ చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసులో పాక్ దౌత్యవేత్తపై తొలికేసు నమోదు చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించారు. తాజా నోటీసుల ప్రకారం అక్టోబరు 15వతేదీన సిద్ధిఖీ ఎన్‌ఐఏ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉందని సమన్ల సమాచారం.