కాళ్లతో కారు డ్రైవింగ్.. RTO నుంచి లైసెన్స్.. రాష్ట్రంలో తొలి వ్యక్తిగా రికార్డ్..​!

ఆత్మవిశ్వాసంతో కారు డ్రైవింగ్ నేర్చుకుని కాళ్లతోనే కారును ఓ ఆట ఆడిస్తున్నాడు.

Update: 2024-05-08 05:12 GMT

కాళ్లతో కారు డ్రైవింగ్.. RTO నుంచి లైసెన్స్.. రాష్ట్రంలో తొలి వ్యక్తిగా రికార్డ్..​!

Man Without Hands Get 4-wheeler Licence: ఆ యువకుడు తన పదేళ్ల ప్రాయంలోనే రెండు చేతులు కోల్పోయాడు. ఇప్పుడు తనకు 30 సంవత్సరాల వయస్సు.. అందరిలానే తనకు కూడా కారు నడపాలని కోరిక. కానీ రెండు చేతులు లేకపోయేసరికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అయితేనేం అలా అని కుమిలిపోలేదు. ఆత్మవిశ్వాసంతో కారు డ్రైవింగ్ నేర్చుకుని కాళ్లతోనే కారును ఓ ఆట ఆడిస్తున్నాడు. అంతేకాదు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి వ్యక్తిగా కూడా నిలిచాడు. అతడే చెన్నైకి చెందిన 30 ఏళ్ల యువకుడు తాన్‌సేన్.

కాళ్లు, చేతులు సరిగా ఉన్న వాళ్లే కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు చాలా శ్రమ పడుతుంటారు. అలాంటిది ఈ తాన్‌సేన్ అనే యువకుడు మాత్రం తనకు రెండు చేతులూ లేకున్నా.. వాహనం డ్రైవింగ్ చేస్తున్నాడు. కాళ్లను ఉపయోగించి కారును నడుపుతున్నాడు. ఒక కాలి పాదంతో స్టీరింగ్ ఆపరేట్ చేస్తూ మరో కాలితో యాక్సిలరేటర్, బ్రేక్ ఆపరేట్ చేస్తాడు. RTO నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కూడా సంపాదించాడు. తమిళనాడులో రెండు చేతులు లేకుండా.. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న తొలి వ్యక్తిగా తాన్‌సేన్ నిలిచాడు.


థాన్‌సేన్‌ (Source : ANI)

సుమారు 20 ఏళ్ల కిందట తాన్‌సేన్ ప్రమాదవశాత్తూ హైటెన్షన్ వైర్లకు తగిలాడు. ఈ ప్రమాదంలో గాయపడిన తాన్‌సేన్‌కు వైద్యులు సర్జరీ చేసి.. రెండు చేతులనూ మోచేతుల వరకు తొలగించారు. 18 ఏళ్లప్పుడు తన స్నేహితులందరూ డ్రైవింగ్‌ లైసెన్స్ పొందడాన్ని చూసి తాను కూడా డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలని ఆశపడ్డారు. కానీ తన ఆశకు రెండు చేతులు లేకపోవడం పెద్ద అవరోధంగా మారింది. అయితే థాన్‌సేన్‌ పట్టుదల శ్రమ ముందు ఆ సమస్య చిన్నబోయింది. కేరళలో ఒక మహిళ తనకు రెండు చేతులూ లేనప్పటికీ, డ్రైవింగ్ లైసెన్స్ పొందగలిగింది. ఆమె నుంచి తాను ప్రేరణ పొందినట్లు తాన్‌సేన్ తెలిపాడు.

ఇక తాన్‌సేన్‌ కారు నడిపేందుకు డాక్టర్లు గేర్‌లెస్ కారును రిఫర్ చేశారు. అతడి అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు సూచించారు. తాన్‌సేన్ తన కుడి పాదాన్ని స్టీరింగ్ కోసం, ఎడమ పాదాన్ని యాక్సిలరేషన్, బ్రేకింగ్ కోసం ఉపయోగిస్తాడు. వైపర్లు, హారన్, సూచికలు, లైట్ల కోసం అవసరమైన స్విచ్‌లను సైతం పాదాలతోనే ఆపరేట్ చేస్తాడు. తాన్‌సేన్ ఇప్పుడు తన సీటు బెల్ట్‌ను తనే బిగించుకొని, స్టీరింగ్ వీల్‌పై తన పాదాన్ని ఉంచి డ్రైవ్ చేసుకుంటూ వెళతాడు.

Tags:    

Similar News