గంటకో మలుపు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయాలు

-ఆసక్తికరంగా మహారాష్ట్ర రాజకీయాలు -సస్పెన్స్‌, థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్న మహా రాజకీయం

Update: 2019-11-24 02:22 GMT
Ajit Anantrao Pawar

మరాఠ రాజకీయాలు క్షణ క్షణానికి మరిపోతున్నాయి. ఎత్తులు పైయెత్తులతో మహా రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు మోడీ-అమిత్‌ షా రాజకీయ మంత్రాంగం.. మరోవైపున శరద్‌ పవార్‌ వేస్తున్న పైయెత్తులతో.. మహారాష్ట్ర రాజకీయలు రసవత్తరంగా మారాయి. సుమారు నెలరోజులుగా కొనసాగుతున్న పొలిటికల్ డ్రామా.. క్లైమాక్స్ చేరడంతో రాష్ట్రంలో పవర్ గేమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. అమిత్‌షా-మోడీ, శరద్‌పవార్‌ల చాతుర్యానికి పరీక్షగా మారింది.

మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ చదరంగం ఆసక్తికరంగా మారింది. బీజేపీ వర్సెస్ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి వ్యూహప్రతివ్యూహాలతో మహారాష్ట్ర రాజకీయం పూటకో మలుపు తిరుగుతోంది. ఇంతవరకు పెదవి విప్పని మోడీ-అమిత్ షా రహస్యంగా కార్యాచరణ జరిపి.. పవర్ గేమ్ లో సొంత కుటుంబ సభ్యునితోనే పవార్‌ను దెబ్బతీశారు. బీజేపీకి మద్దతు ఇవ్వకూడదని శివసేన నిర్ణయించడం.. ఎన్సీపీకి కలిసి వచ్చిన అంశం. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు శరద్ పవార్ తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు.

మహారాష్ట్రలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి జరిగిన రాజకీయ పరిణామాలు సస్పెన్స్‌, థ్రిల్లర్‌ సినిమాను తలపించాయి. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ కూటమి గద్దెనెక్కకుండా గవర్నర్‌ కోశ్యారీ ఆగమేఘాలపై స్పందించిన తీరు.. రాజకీయ ఉద్దండులను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. రాజ్ భవన్ వేదికగా బీజేపీ అమలుచేసిన యాక్షన్ ప్లాన్ గురించి కొద్దిమంది కమలనాథులకు మాత్రమే తెలుసు. రాత్రికి రాత్రే, పరిస్థితి పూర్తిగా మారిపోతుందని.. కాంగ్రెస్‌, ఎన్‌సీపీ నేతలు ఊహించలేదు. కమలదళం ఈ ఆపరేషన్‌ను చాలా సీక్రెట్ గా అమలు చేసింది.

మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి జరిగిన పరిణామాలను పరిశీలిస్తే, ఇదంతా ఒక్కరోజులో జరిగింది కాదని.. ఈ పవర్ గేమ్ వెనుక, చాలా ప్లానింగ్ ఉందని అర్థమవుతుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అక్టోబరు 24వ తేదీ రాత్రికే.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేదన్న విషయం అందరికీ తెలుసు. శివసేన-బీజేపీ కూటమిగా పోటీచేశాయి కాబట్టి.. ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. కానీ ఫలితాల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. తమకూ సీఎం పదవి కావాలని శివసేన పట్టుబట్టడం ప్రారంభించింది. శివసేన డిమాండ్లను ఒప్పుకోని బీజేపీ.. వెంటనే ప్లాన్‌-బీకి పదునుపెట్టింది. దీనిలో భాగంగానే అదే రోజు రాత్రి, ఎన్‌సీపీ నేత అజిత్‌పవార్‌ ఎవరికీ కనిపించకుండా మాయమయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్లారు? ఎవరితో సమావేశమయ్యారన్నది సస్పెన్స్‌.

అసెంబ్లీ ఫలితాలు వెలువడిన నాటి నుంచి కాంగ్రెస్‌-ఎన్‌సీపీ-శివసేన మధ్య జరుగుతున్న చర్చల్ని జాగ్రత్తగా గమనిస్తున్న.. కమలనాథులు ఆ శిబిరంలో నుంచి కలిసివచ్చే వారి కోసం వేచిచూశారు. కూటమి చర్చల్లో పురోగతిని అజిత్‌పవార్‌ ఎప్పటికప్పుడు.. బీజేపీ శిబిరానికి చేరవేసినట్లు సమాచారం. శుక్రవారం శివసేన, కాంగ్రెస్‌, ఎన్‌సీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయింది. ఇది అజిత్‌పవార్‌కి, బేజేపీకి పెద్ద షాక్‌ ఇచ్చింది. అజిత్‌పవార్‌ ముందు రెండు ప్రత్యామ్నాయాలు మిగిలాయి. తన బాబాయ్‌ శరద్‌పవార్‌తో కలిసి వెళ్లడం.. లేదా, తన సొంత ప్రణాళికను అమలుచేయడం. రెండోదానివైపే ఆయన మొగ్గు చూపారు.  

Tags:    

Similar News