Lockdown in many states: పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్.. కేంద్రం ఏం అంటోందంటే..

Lockdown in many states: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని పలు రాష్ట్రాలు విశ్వసిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది.

Update: 2020-07-17 15:40 GMT

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కలకలం కొనసాగుతోంది. దశల వారీగా లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. నిన్న మొన్నటివరకూ మూడు నాలుగు వందల లోపే కేసులు నమోదైన రాష్ట్రాల్లో కూడా నేడు వేలాది కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి లాక్‌డౌన్‌‌‌ను విధించాలన్న నిర్ణయానికి వచ్చాయి. కర్ణాటకలో ప్రమాదకరంగా పరిస్థితి మారడంతో చేశేది లేక బెంగళూరు నగర, గ్రామీణ జిల్లాల్లో వారం రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ జులై 14 నుంచి విధించింది. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్, అసోం, బిహార్‌లలో కూడా పలు ప్రాంతాలలో పూర్తిస్థాయి లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు ప్రకటించాయి.

బిహార్‌లో జులై 16 నుంచి 31 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలులో ఉన్నా కేసులు విపరీతంగా పెరిగాయి. అస్సలు కేసులు లేని ప్రాంతాలలో కూడా కొత్తగా రావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోనూ కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో జులై 19 వరకు లాక్‌డౌన్ కొనసాగనుందని ప్రకటించింది. అసోంలోని కొన్ని జిల్లాల్లో జూన్ 28 నుంచి మొదలైన లాక్‌డౌన్ జులై 19 వరకు పొడిగించారు.

మరోవైపు లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తోంది. వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్ ను విధించడమే కాకుండా ఈ నిర్ణయాన్ని ఉపయోగకరంగా వాడుకోవాలని సూచించింది. మూడు అంశాల వ్యూహంతో లాక్‌డౌన్ ను పటిష్టంగా అమలుచేయాలని సూచించింది. కంటెయిన్‌మెంట్ జోన్ల ఏర్పాటు, బఫర్ జోన్లు, అలాగే కొత్త కంటెయిన్‌మెంట్ జోన్ల గుర్తింపు వాటి నిర్వహణ, హోంక్వారంటైన్‌లో ఉన్న కరోనా బాధితులపై నిఘా.. అలాగే ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచాలని సూచన చేసింది. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటేనే మరోసారి విధిస్తున్న లాక్‌డౌన్ లాభదాయకంగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పింది.  

Tags:    

Similar News