BR Gavai: సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణస్వీకారం.. తొలి బౌద్ధ మతస్థుడిగా రికార్డు
BR Gavai: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (Justice BR Gavai) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.
BR Gavai: సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణస్వీకారం.. తొలి బౌద్ధ మతస్థుడిగా రికార్డు
BR Gavai: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (Justice BR Gavai) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి సారథ్యం వహించనున్న జస్టిస్ గవాయి నియామకంలో ఒక చారిత్రక విశేషం ఉంది. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించిన తొలి బౌద్ధ మతస్థుడిగా ఆయన గుర్తింపు పొందారు.
మహారాష్ట్ర అమరావతిలో 1960 నవంబరు 24న జన్మించిన జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి (B.R. Gavai), న్యాయవృత్తిలో అంచెలంచెలుగా ఎదిగి, భారత న్యాయవ్యవస్థలో కీలక స్థానాన్ని సంపాదించారు. 1985 మార్చి 16న న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన గవాయి, అనేక కీలకమైన న్యాయమూర్తులకు సహాయకుడిగా సేవలందించారు.
2003 నవంబరు 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన, 2005 నవంబరు 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం ముంబయి ప్రధాన ధర్మాసనంతో పాటు నాగ్‌పుర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు. గత ఆరేళ్ల కాలంలో జస్టిస్ గవాయి సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామ్యం పంచుకున్నారు. రాజ్యాంగ, పరిపాలన, సివిల్, క్రిమినల్ చట్టాలు, వాణిజ్య వివాదాలు, ఆర్బిట్రేషన్, విద్యుత్తు, విద్య, పర్యావరణానికి సంబంధించి అనేక కీలకమైన కేసులను విచారించారు.