Jodidara: ఒక మహిళ.. ఇద్దరు భర్తలు.. ఏంటీ ‘జోడీదారా’ సంప్రదాయం?

నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ, విద్యాభివృద్ధితో పురాతన సంప్రదాయాలు లాక్కొనిపోతున్నా, కొన్ని ప్రాంతాల్లో వాటిని ఇంకా కొనసాగిస్తున్నారు. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఒక వివాహం మరోసారి ‘జోడీదారా’ సంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసింది.

Update: 2025-07-20 13:01 GMT

Jodidara: ఒక మహిళ.. ఇద్దరు భర్తలు.. ఏంటీ ‘జోడీదారా’ సంప్రదాయం?

నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ, విద్యాభివృద్ధితో పురాతన సంప్రదాయాలు లాక్కొనిపోతున్నా, కొన్ని ప్రాంతాల్లో వాటిని ఇంకా కొనసాగిస్తున్నారు. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఒక వివాహం మరోసారి ‘జోడీదారా’ సంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసింది.

ఏమైంది విషయం?

హిమాచల్‌ ప్రదేశ్‌ సిర్మౌర్‌ జిల్లాలోని కున్హత్‌ గ్రామానికి చెందిన సునీత అనే యువతిని, షిల్లై గ్రామానికి చెందిన ప్రదీప్, కపిల్ నేగీ అనే ఇద్దరు సోదరులు ఒకేసారి వివాహం చేసుకున్నారు. ప్రదీప్‌ ప్రభుత్వ ఉద్యోగి కాగా, కపిల్‌ విదేశాల్లో పని చేస్తున్నారు. ఈ వివాహ వేడుక మూడు రోజుల పాటు కొనసాగింది. వందలాది బంధువులు హాజరై సాక్ష్యం చెప్పారు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి.

తాము ఇద్దరికీ ఒకే మహిళను వివాహం చేసుకోవాలని సొంతంగా నిర్ణయం తీసుకున్నామని, ఇందులో ఎటువంటి ఒత్తిడి లేదని వారు వెల్లడించారు. "ఈ సంప్రదాయం గురించి ముందే తెలుసు. ఇలాంటి బంధాన్ని గౌరవంగా స్వీకరిస్తున్నాను" అని వధువు కూడా స్పష్టం చేశారు.

జోడీదారా అంటే ఏమిటి?

జోడీదారా లేదా జజ్‌దా అనే సంప్రదాయం ప్రకారం, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే మహిళను వివాహం చేసుకుంటారు. ఈ సంప్రదాయం ప్రకారం, ఆ మహిళకు పుట్టే పిల్లల తండ్రిగా పెద్ద సోదరుడిని పరిగణిస్తారు. వివాహ తంతును “సీంజ్‌”గా పిలుస్తారు.

ఈ సంప్రదాయం చట్టపరంగా నిషేధించబడ్డదైనా, స్థానిక పాలకులు ‘జోడీదార్ చట్టం’ ప్రకారం కొన్ని సందర్భాల్లో దీనిని గుర్తిస్తున్నట్లు సమాచారం.

హట్టీ తెగ ఎవరు?

ఈ సంప్రదాయం పాటించే హట్టీ తెగ, హిమాచల్‌ ప్రదేశ్‌–ఉత్తరాఖండ్‌ సరిహద్దులో ఉన్న పర్వత ప్రాంతాల్లో నివసిస్తుంది. సిర్మౌర్‌ జిల్లాలో 450 గ్రామాల్లో ఈ తెగలు విస్తరించి ఉన్నాయి. వీరి మొత్తం జనాభా సుమారుగా 3 లక్షలు.

ఇక్కడ శతాబ్దాలుగా ఈ జోడీదారా సంప్రదాయం నడుస్తూనే ఉంది. కానీ ఇటీవల మహిళల్లో విద్యాభివృద్ధి, స్వతంత్ర ఆదాయ వనరులు పెరగడంతో ఈ సంప్రదాయాన్ని అనేక మంది పక్కనపెడుతున్నారు. అయినా కొన్ని గ్రామాల్లో మాత్రం ఇది ఇప్పటికీ రహస్యంగా కొనసాగుతోంది.

ఈ సంప్రదాయం వెనుక కారణాలేంటి?

జోడీదారా పద్ధతి వెనుక ప్రధాన ఉద్దేశం – పూర్వీకుల భూమి విభజనను నివారించడం అని కుందన్ సింగ్ శాస్త్రి, కేంద్రీయ హట్టీ సమితి ప్రధాన కార్యదర్శి చెప్పారు.

అలాగే ఉమ్మడి కుటుంబంలో సోదరభావం, పరస్పర అవగాహన పెరగడం, పెద్ద కుటుంబం ఏర్పడి గిరిజన సమాజానికి భద్రత పెరగడం కూడా ప్రధాన లక్ష్యాలుగా భావిస్తారు. ఈ సంప్రదాయం వేల ఏళ్ల క్రితమే ప్రారంభమైందని విశ్వసిస్తున్నారు.

Tags:    

Similar News