అసలు ఎవరు ఈ డాక్టర్ శివన్ ?

ఆయనో రైతు బిడ్డ. చిన్నతనం నుంచీ వాతావరణం వ్యవసాయంతో ఆడుకోవడం చూస్తూ పెరిగారు. తండ్రితో వ్యవసాయ పనులకు వెళుతూనే.. అసలు వాతావరణం ఏమిటని ఆలోచించారు. చదువు మీద దృష్టి పెట్టారు.. జాబిలిని అందుకునే ప్రయత్నం వరకూ ఎదిగారు. ఆయనే \మన ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్. అయన గురించిన విశేషాలు క్లుప్తంగా...

Update: 2019-09-07 14:48 GMT

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 చివరి దశలో సమస్య తలెత్తింది. విక్రమ్‌ ల్యాండర్‌ మృదువుగా చంద్రుడిపై దిగుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అన్ని దశలనూ విజయవంతంగా దాటుకుంటూ వచ్చినా గమ్యం ముంగిట్లో తడబాటు ఎదురైంది... దీనిని ప్రత్యక్షంగా వీక్షించిన మోడీ ఇస్రో ఛైర్మెన్ డాక్టర్ శివన్ కంటతడి పెడుతుండగా ఆయనని ఓదార్చారు . అయితే ఇప్పుడు నెటిజన్లు ఈ డాక్టర్ శివన్ ఎవరు ? ఏక్కడి నుండి వచ్చాడని గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు. ప్రజలు ఆయన గురించి తెలుసుకోవడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. అయన గురించిన విశేషాలు మీకోసం..

రైతు కుటుంబం నుంచి..

డాక్టర్ శివన్ ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తీ, ఆయన తండ్రి వ్యవసాయం చేస్తుండేవారు. అయన తమిళనాడులో కన్యాకుమారి జిల్లాలో ఉన్న మేలా సరక్కల్‌విలాయ్ అనే చిన్న గ్రామంలో  ఏప్రిల్జ 14 1957 లో జన్మించారు. తండ్రి కైలాసవాదివినోదార్, తల్లి చెల్లమ్మాల్.  డాక్టర్ శివన్ కి ఒక సోదరుడు, ఇద్దరు సోదరిమణులు ఉన్నారు. డాక్టర్ శివన్ అయన తండ్రికి సహాయంగా వ్యవసాయ పనులకు వెళుతుండేవారు. ఆయనకు చదువు మీద ఆసక్తి ఎక్కువ. తండ్రికి వ్యవసాయంలో సహాయపడుతూనే తన చదువును కొనసాగించారు.  

చదువులో టాప్..

 అయన తండ్రికి సహాయం చేస్తూనే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తమిళం మీడియంలో ప్రాథమిక, ఉన్నత విద్యను పూర్తిచేశారు. ఆ  తర్వాత నాగర్‌కోయిల్‌లోని సెయింట్ హిందు కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 1980లో మద్రాస్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.  1982లో ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2006లో ఐఐటీ బాంబే నుంచి ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

ఇస్రోలో శివన్..

1982లో శివన్ ఇస్రోలో డిజైన్, వెహికల్ లాంచింగ్ డెవలప్మెంట్ డివిజన్ లో శాస్త్రవేత్తగా బాధ్యతలు చేపట్టారు. . ఇస్రో ప్రయోగించే ప్రతి రాకెట్ ప్రోగ్రామ్‌లో అయన  కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అలా అయన అనుభవం ఆయనని 2018 జనవరిలో ఇస్రో ఛైర్మెన్‌ ని చేసింది . శివన్ నేతృత్వంలో మొదటగా చంద్రయాన్-2 ని జూలై 15న ప్లాన్ చేసారు కానీ ఇందులో సాంకేతిక లోపం రావడంతో దానికి గల పరిష్కారాన్ని కనుకొని మళ్ళీ జూలై 22న నింగిలోకి విజయవంతంగా పంపించారు. చంద్రయాన్ 2 వెనుక ఆయన కృషి ఎనలేనిది. తన శాస్త్రవేత్తల బృందాన్ని ముందుండి ఈ మిషన్ లో నడిపించారు. భారత కీర్తి పతాకను చంద్రునిపై ఎగురవేయాలని కలలు కన్నారు. ఇప్పుడు వచ్చిన చిన్న అంతరాయం ఆయనకు పెద్ద సవాల్ వంటిదే. రైతు బిడ్డగా ప్రతి క్షణం వాతావరణంతొ పోరాటం చేయడం చిన్ననాటినుంచే నేర్చుకున్న డాక్టర్ శివన్.. చంద్రయాన్ విషయంలో అయన కలల ను త్వరలోనే నెరవేర్చుకుంటారు. భారత కీర్తి పతాకను జాబిలిపై ఆయన నిలబెదతారనే నమ్మకం దేశ ప్రజల్లో బలంగా ఉంది. కోట్లాది మంది భారతీయులు ఆయన వెనుక మేమున్నాం  అంటున్నారిప్పుడు. 

Tags:    

Similar News