Indian Navy: ఇండియన్ నేవీ చేతికి మోస్ట్ అడ్వాన్స్‌డ్ మిస్సైల్ సిస్టమ్.. 'స్మార్ట్' హిందూ మహాసముద్రంలో చైనా లెక్క తేలుస్తుందా?
SMART: సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో. సింపుల్‌గా షార్ట్‌కట్‌లో చెప్పాలంటే స్మార్ట్.! డ్రాగన్ గుండెల్లో దడ పుట్టిస్తున్న మోస్ట్ అడ్వాన్స్‌డ్ మిస్సైల్ ఇది.
Indian Navy: ఇండియన్ నేవీ చేతికి మోస్ట్ అడ్వాన్స్‌డ్ మిస్సైల్ సిస్టమ్.. 'స్మార్ట్' హిందూ మహాసముద్రంలో చైనా లెక్క తేలుస్తుందా?
SMART: సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో. సింపుల్‌గా షార్ట్‌కట్‌లో చెప్పాలంటే స్మార్ట్.! డ్రాగన్ గుండెల్లో దడ పుట్టిస్తున్న మోస్ట్ అడ్వాన్స్‌డ్ మిస్సైల్ ఇది. పేరుకు తగినట్టుగానే ఇది చాలా స్మార్ట్. గత కొంత కాలంగా హిందూ మహా సముద్రంలో రెచ్చిపోతున్న చైనాకు చెక్ పెట్టాలనే లక్ష్యంతోనే డీఆర్డీవో ఈ డెడ్లీ మిస్సైల్‌ను అభివృద్ధి చేసింది. స్మార్ట్ ట్రయల్స్ కూడా సూపర్‌సక్సెస్ అయ్యాయి. ఇక మిగిలిందల్లా హిందూ మహాసముద్రంలో యాక్షన్ షురూ చేయడం ఒక్కటే. ఇంతకూ, అసలేంటీ సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో? హిందూ మహాసముద్రంలో చైనా ఆక్రమణ కుట్రలకు ఎలా చెక్ పెడుతుంది?
సముద్రంలో బలాన్ని పెంచుకునేందుకు భారత నావికాదళం సూపర్‌సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో వ్యవస్థను రూపొందించింది. తాజాగా ఈ ట్రయల్స్ నిర్వహించింది. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి స్మార్ట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. స్మార్ట్ అనేది నెక్స్ట్ జనరేషన్ మిస్సైల్ ఆధారిత తేలికపాటి టార్పెడో డెలివరీ సిస్టమ్.. ఇది తేలికపాటి టార్పెడోల సాంప్రదాయ శ్రేణికిమించి ఇండియన్ నేవీ యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు డీఆర్డీవో అభివృద్ధి చేసింది. సూపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థ అనేక అధునాతన ఉప వ్యవస్థలను కలిగి ఉంటుంది. ఇందులో రెండు దశల సాలిడ్ ప్రొపల్షన్ సిస్టమ్, ఎలక్ట్రోమెకానికల్ యాక్యుయేటర్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా.. ఎలక్ట్రోమెకానికల్ యాక్యుయేటర్ సిస్టమ్, ప్రెసిషన్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ కలిగి ఉంది. ఈ సిస్టమ్ పారాచూట్-ఆధారిత విడుదల వ్యవస్థతో పేలోడ్‌గా అధునాతన తేలికపాటి టార్పెడోను కలిగి ఉంటుంది. గ్రౌండ్ మొబైల్ లాంచర్ నుంచి క్షిపణిని ప్రయోగించారు. పరీక్షలో సిమెట్రిక్ సెపరేషన్, ఇంజెక్షన్ మరియు వెలాసిటీ కంట్రోల్ వంటి అనేక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మెకానిజమ్‌లు ఉన్నాయి. ఈ క్షిపణి వ్యవస్థ సుదూర లక్ష్యాలను ఛేదించగలదు. స్మార్ట్ క్షిపణిని యుద్ధనౌకల నుండి అలాగే తీర ప్రాంతాల నుండి ప్రయోగించవచ్చు.
దేశ ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రమాదకరంగా చొచ్చుకొచ్చే శత్రు దేశాల సబ్‌మెరైన్లను దూరం నుంచే గమనించి ధ్వంసం చేయడానికి ఈ టార్పిడోను వాడతారు. బ్రహ్మోస్ మాక్-3 యాంటీషిప్ మిసైల్ తర్వాత చేపట్టిన అత్యంత కీలకమైన ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. 2016లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 340 కోట్లను కేటాయించింది. భారత్ ఇప్పటికే టార్పిడోలు, క్షిపణులను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తోంది. తాజాగా ఈ రెండు టెక్నాలజీలను కలిపి సరికొత్త హైబ్రీడ్ ఆయుధాన్ని రూపొందించింది. సాధారణంగా భారీ టార్పిడోలు కూడా నీటిలో గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తాయి. రాకెట్ అసిస్టెడ్ విధానంలో 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. కానీ, ఈ సరికొత్త హైబ్రీడ్ విధానంలోని టార్పిడో 600 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఇదే దీని ప్రత్యేకత. సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో మిస్సైల్ వ్యవస్థను బ్రహ్మోస్ తర్వాత అతిపెద్ద ప్రాజెక్టుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఆయుధానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని, బాలిస్టిక్ క్షిపణి ప్లస్ టార్పిడో కలిస్తే స్మార్ట్‌గా రూపుదిద్దు కుంటుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
మరోవైపు.. స్మార్ట్‌ను శత్రువుపై ప్రయోగించిన తర్వాత లక్ష్యానికి సమీపంగా వెళ్లేంతవరకు గాల్లో క్షిపణి మాదిరిగా ప్రయాణిస్తుంది. సబ్‌మెరైన్ సమీపానికి రాగానే గాలిలో నుంచి నీటిలోకి టార్పిడోను పడే స్తుంది. అది వెళ్లి లక్ష్యాన్ని ఢీకొంటుంది. దాడికి కొన్ని నిమిషాల ముందు వరకు కూడా ఈ టార్పిడోను శత్రుదేశాల సబ్‌మెరైన్లు గుర్తించలేవు. గుర్తించే సమయానికి పెను విధ్వంసమే సృష్టిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. స్మార్ట్ విషయంలో అప్రమత్తమై తప్పించుకునే అవకాశాలు శత్రు సబ్‌హెరైన్లకు ఉండవన్న మాట. ఇది గాల్లో తక్కువ ఎత్తులో ప్రయాణించడంతో రాడార్లకు కూడా అంత తేలిగ్గా దొరకదు. దీనికి డేటా లింక్‌లు కూడా ఉండటంతో నియంత్రణ ఉంటుంది. ఇప్పటివరకు అమెరికా, రష్యాకు ఇలాంటి అత్యాధునిక వ్యవస్థలు ఉన్నాయి. చైనా వద్ద వైయూ-8 పేరుతో ఇప్పటికే ఒక వ్యవస్థ ఉంది. కానీ, దీని రేంజ్ చాలా తక్కువ. దీంతో పోలిస్తే భారత్ అభివృద్ధి చేసిన స్మార్ట్ ఎన్నో రెట్లు ఉత్తమమైన వ్యవస్థ. అందుకే ఇండియన్ నేవీకి స్మార్ట్ పేరుకు తగ్గట్టుగా స్మార్ట్‌గా ఉపయోగపడుతుందనేది.
నిజానికి.. ఇటీవలి కాలంలో హిందూ మహాసముద్రంలో చైనా రెచ్చిపోతోంది. మాల్దీవుల్లో చైనా అనుకూల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రాగన్ తోక జాడింపులు పెరిగిపోయాయి. భారత్‌తో మాల్దీవులకు దౌత్యపరంగా తీవ్ర వివాదం కొనసాగిస్తున్న వేళ.. ఇటీవల చైనాకు చెందిన పరిశోధక నౌక కొన్నిరోజుల పాటు మాల్దీవుల జలాల్లో తిష్ట వేసింది. ఆ తర్వాత అది చైనాకు వెళ్లిపోగా.. తాజాగా మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. దాదాపు 4500 టన్నుల బరువు ఉన్న ఈ షియాంగ్ యాంగ్ హాంగ్-03 నౌక.. ఈ ఏడాది జనవరిలో చైనాలోని సన్యా నుంచి బయల్దేరింది. మాల్దీవుల ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ సరిహద్దుల్లో నెల రోజుల పాటు తిరిగిన ఈ రీసెర్చ్ షిప్.. ఫిబ్రవరి 23న తిలాఫుషీ పోర్టుకు చేరుకుంది. అక్కడ వారం రోజుల పాటు ఉన్న ఆ నౌక.. తర్వాత తిరిగి వెళ్లింది. ఇది జరిగిన దాదాపు 2 నెలల పాటు వివిధ పోర్టులకు వెళ్లిన ఈ షియాంగ్ యాంగ్ హాంగ్-03.. ప్రస్తుతం మళ్లీ మాల్దీవులుకు చేరుకుంది. ఈ నౌక మాలె తీరానికి చేరుకున్న విషయాన్ని మాల్దీవుల విదేశాంగ శాఖ మంత్రి వెల్లడించారు. సిబ్బంది రొటేషన్ కోసం చైనా ప్రభుత్వం నుంచి దౌత్యపరమైన అభ్యర్థన వచ్చిన మేరకు ఆ నౌకను తమ జలాల్లోకి అనుమతించినట్లు తెలిపారు.
వాస్తవానికి.. డ్రాగన్ నిఘా నౌక మాల్దీవుల్లో మకాం వేయడానికి శాస్త్రీయ పరిశోధనలను రీజన్‌గ చూపిస్తున్నా.. అసలు లక్ష్యం మాత్రం హిందూ మహాసముద్ర ప్రాంతంలోని విస్తారమైన ప్రాంతాల్లో సర్వే చేయడమే. ఈ నౌకల నుంచి సేకరించిన డేటా మలక్కా జలసంధి, తూర్పు హిందూ మహాసముద్రం జలాల ద్వారా నావిగేట్ చేయడానికి ప్రయత్నిస్తున్న చైనా సబ్‌మెరైన్లకు కీలకం. దీని వల్ల భారత్‌కు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సర్వే నౌక సీఫ్లూర్ మ్యాపింగ్‌లో పాల్గొంటుందని, సముద్రగర్భ వాతావరణం ఆకృతు లను అర్థం చేసుకోవడానికి హైడ్రోలాజికల్ డేటాను రికార్డ్ చేయడం, సముద్రగర్భ కేబుల్స్, క్షిపణి వీక్షణలు మొదలైన వాటి నుంచి ఇంటెలిజెన్స్ వివరాలను సేకరిస్తుందని రక్షణ నిపుణులు ఎప్పట్నుంచో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. హిందూ మహా సముద్రంలో చైనా నేవీ చేస్తున్న సర్వే ఈ ప్రాంతంలో ఆ దేశ సైనిక కార్యకలాపాలకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు.. విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం గత 20-25 ఏళ్లుగా హిందూ మహాసముద్రంలో చైనా నావికాదళ ఉనికి క్రమంగా పెరుగుతోందని గతంలో ప్రకటించారు. చైనా నేవీ పరిమాణంలో చాలా వేగంగా పెరుగుదలఉందని చెబుతూ.. పాకిస్తాన్‌లోని గ్వాదర్, శ్రీలంకలోని హంబన్‌టోటలో చైనా ఓడరేవు నిర్మాణాన్ని ఉదహరించారు. దక్షిణాసియాలో చైనా నిర్వహిస్తున్న మూడు నౌకాశ్రయాలు, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్, శ్రీలంకలోని హంబన్‌టోట, పాకిస్తాన్‌లోని గ్వాదర్‌ను భారత్‌ను చుట్టుముట్టే మృత్యు త్రిభుజంగా పిలుస్తారు. 2022లో చైనా గూఢచారి నౌక యువాన్ వాంగ్ 5 శ్రీలంకలోని దక్షిణ ఓడరేవు హంబన్‌టోటకు చేరుకుంది. ఈ నిఘా నౌక ఉపగ్రహ ట్రాకింగ్, రాకెట్ పర్యవేక్షణ, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలకు ఉపయోగించబడుతుంది. యువాన్ వాంగ్ నౌకను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్ నిర్వహిస్తోందని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ పెంటగాన్ తెలిపింది. దీన్నిబట్టి డ్రాగన్ కంట్రీ రీసెర్చ్ కుట్రలేంటో అర్ధం చేసుకోవచ్చు.
వాస్తవానికి.. భారత్ ప్రభావ పరిధిలో చైనా సర్వే నౌకలు సర్వసాధారణం అయ్యాయి. హిందూ మహాసముద్రం అడుగుభాగంలో ఉన్న శిఖరంపై చైనీయులకు ప్రత్యేక ఆసక్తి ఉందని నివేదికలు సూచిస్తు న్నాయి. ఈ శిఖరం హిందూ మహాసముద్రాన్ని పశ్చిమ, తూర్పు సముద్రంగా విభజిస్తుంది. సబ్‌మెరైన్ కార్యకలాపాలకు ఈ శ్రేణి చాలా కీలకమని నౌకాదళ నిపుణులు చెబుతున్నారు. హిందూ మహా సముద్రంలో చైనా సబ్‌మెరైన్లు తమ కార్యకలాపాలను పెంచుకోవడానికి దాని డేటా సహాయం చేస్తుంది. హిందూ మహాసముద్రంలో చైనా మ్యాపింగ్ చేయడంలో విజయం సాధిస్తే.. ఆ దేశ సబ్‌మెరైన్లు మన నేవీ కళ్లుగప్పి స్వేచ్ఛగా తిరగడం మొదలవుతుంది. సముద్రంలో యుద్ధంలోనూ పై చేయి సాధించడానికి ఆనుపానులన్నీ తెలుసుకునే వీలుంటుంది. అందుకే, మాల్దీవుల్లో డ్రాగన్ రీసెర్చ్ కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే, మోడీ సర్కార్ స్మార్ట్‌ను అభివృద్ధి చేసింది. ఇప్పుడు స్మార్ట్ ఎంట్రీతో హిందూ మహాసముద్రంలో రెచ్చిపోదాం అనుకున్న డ్రాగన్ తోక ముడవక తప్పదు.