తొలి ప్లాస్మా చికిత్స సక్సెస్ : కోవిడ్ రోగి డిశ్చార్జ్
కోవిడ్-19 చికిత్సకు ఇంకా ఎలాంటి ఔషధం అందుబాటులోకి రాలేదు. అయితే, గత కొన్ని రోజులుగా ప్లాస్మా థెరపీ అనే మాట తరచూ వార్తల్లో వినిపిస్తోంది.
కోవిడ్-19 చికిత్సకు ఇంకా ఎలాంటి ఔషధం అందుబాటులోకి రాలేదు. అయితే, గత కొన్ని రోజులుగా ప్లాస్మా థెరపీ అనే మాట తరచూ వార్తల్లో వినిపిస్తోంది.ఈ క్రమంలో ప్లాస్మా చికిత్సతో కోవిడ్ రోగి కోలుకున్నారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రి నుంచి కోవిడ్ రోగి పూర్తిగా కోలుకున్నారని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో 49 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ సాకేత్‌లోని మాక్స్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు వైద్యులు.
కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా రోగులకు అందిస్తున్న ప్లాస్మా చికిత్స సానుకూల ఫలితాలనిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండు రోజుల కిందట చెప్పిన సంగతి తెలిసిందే. లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్లపై ఈ మేరకు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా కోవిడ్ రోగి కోలుకోవడంతో ఆశలు చిగురించాయి. ఇదిలావుంటే కర్ణాటకలో కూడా తొలి ప్లాస్మా చికిత్స సక్సెస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. కోవిడ్-19 రోగులకు ప్లాస్మా థెరపీని వాడాలని కేరళ వైద్య నిపుణులు పంపిన ప్రతిపాదనకు ఇటీవల భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.