India GDP: దటీజ్ భారత్.. జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ..!!
India GDP: దటీజ్ భారత్.. జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ..!!
India GDP: భారత్ మరో చారిత్రక ఘట్టాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా ఎదుగుతున్న దేశంగా నిలుస్తూ.. జపాన్‌ను వెనక్కినెట్టి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారత ఎకానమీ విలువ ప్రస్తుతం 4.18 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం దేశ ఆర్థిక బలాన్ని స్పష్టంగా చాటుతోంది. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపుపొందిన భారత్, ఇప్పుడు గ్లోబల్ ఎకానమీకి దిశానిర్దేశం చేసే స్థాయికి చేరడం విశేషం.
భారత ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ వృద్ధి కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా దేశంలోని పరిశ్రమలు, సేవారంగం, డిజిటల్ ఎకానమీ, మౌలిక వసతుల అభివృద్ధిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మాన్యుఫాక్చరింగ్, స్టార్టప్ ఎకోసిస్టమ్, ఎగుమతుల రంగాల్లో వచ్చిన వేగవంతమైన పురోగతి ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. మేక్ ఇన్ ఇండియా , డిజిటల్ ఇండియా వంటి విధానాలు వాస్తవ ఫలితాలను ఇస్తున్నాయనేందుకు ఇదే నిదర్శనం.
ఇదిలా ఉండగా, 2030 నాటికి జర్మనీని అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. వచ్చే నాలుగేళ్లలోనే భారత్ 7.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదుగుతుందని అంచనా వేస్తోంది. ఇది సాధ్యమయ్యే దిశగా దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పటిష్టమైన అడుగులు వేస్తోంది.
ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం, 2025–26 ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో రియల్ GDP వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ, భారత్ ఈ స్థాయి వృద్ధిని సాధించడం గ్లోబల్ మార్కెట్లను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వేగం కొనసాగితే, రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా మరింత బలంగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.