IIT Hyderabad: క్యాన్సర్ చికిత్సలో విప్లవం: హైదరాబాద్ శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ..!

IIT Hyderabad: చర్మ క్యాన్సర్ నివారణకు హైదరాబాద్ శాస్త్రవేత్తల సరికొత్త చికిత్సా విధానం. ఐఐటీ హైదరాబాద్, ఐఐసీటీ సంయుక్తంగా నానో కణాల ద్వారా క్యాన్సర్ కణాలను నిర్మూలించే పద్ధతిని ఆవిష్కరించాయి.

Update: 2026-01-21 06:57 GMT

IIT Hyderabad: క్యాన్సర్ రక్కసిని అంతమొందించే దిశగా భాగ్యనగర శాస్త్రవేత్తలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే ఘనత సాధించారు. చర్మ క్యాన్సర్ (మెలనోమా) నివారణకు ఎలాంటి దుష్ప్రభావాలు లేని వినూత్న చికిత్సా విధానాన్ని ఐఐటీ-హైదరాబాద్ (IIT-H) మరియు సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR-IICT) పరిశోధకులు సంయుక్తంగా అభివృద్ధి చేశారు.

నానో టెక్నాలజీతో క్యాన్సర్ ఖతం: ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు బంగారు పూత పూసిన కాల్షియం పెరాక్సైడ్ నానో కణాలను (CPAu-NPs) సృష్టించారు. ఈ విధానం ఎలా పనిచేస్తుందంటే:

టార్గెటెడ్ అటాక్: ఈ నానో కణాలను శరీరంలోకి ప్రవేశపెట్టినప్పుడు, అవి కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే గుర్తించి వాటికి అతుక్కుంటాయి.

ఫొటోథర్మల్ థెరపీ: ప్రత్యేక కాంతిని క్యాన్సర్ ప్రభావిత ప్రాంతంపై ప్రసరింపజేసినప్పుడు, కణాల్లోని బంగారం వేడెక్కి క్యాన్సర్ కణాలను దహించివేస్తుంది.

ఆక్సిజన్ అటాక్: ఇదే సమయంలో కాల్షియం పెరాక్సైడ్ నుంచి విడుదలయ్యే ఆక్సిజన్ క్యాన్సర్ కణాలను లోపలి నుంచి దెబ్బతీస్తుంది.

రోగికి ఉపశమనం.. ఇన్ఫెక్షన్లకు చెక్: సాధారణంగా క్యాన్సర్ చికిత్సలో వాడే కెమోథెరపీ వల్ల ఆరోగ్యకరమైన కణాలు దెబ్బతిని రోగులు తీవ్ర ఇబ్బందులు పడతారు. కానీ, ఈ నూతన పద్ధతిలో ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి హాని జరగదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అంతేకాకుండా, క్యాన్సర్ రోగులను వేధించే ఫంగల్ ఇన్ఫెక్షన్లను కూడా ఈ నానో కణాలు అడ్డుకుంటాయని పరిశోధనలో తేలింది.

ఎలుకలపై ప్రయోగాలు సక్సెస్: ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అరవింద్ కుమార్ రంగన్ నేతృత్వంలో ఈ పరిశోధన సాగింది. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో క్యాన్సర్ కణితులు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. ఈ అద్భుత పరిశోధన వివరాలు ప్రఖ్యాత 'కమ్యూనికేషన్స్ కెమిస్ట్రీ' సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భవిష్యత్తులో శస్త్రచికిత్సలు, కెమోథెరపీ అవసరం లేకుండానే చర్మ క్యాన్సర్‌ను నయం చేసే దిశగా ఈ ఆవిష్కరణ ఒక మైలురాయిగా నిలవనుంది. 

Tags:    

Similar News