Hyderabad: మెట్రో టైమింగ్స్ పెంపు నూతన సంవత్సరం వేడుకలకు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రైళ్లు
నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో రైళ్లు ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా నడుస్తాయి. ఎంఎంటీఎస్ రైళ్లు కూడా ఆలస్యంగా సర్వీసులు అందించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు సేవలకు ప్రత్యేక మార్పులు చేశారు. సాధారణంగా ప్రతి రోజు రాత్రి 11 గంటలకే ప్రారంభ స్టేషన్ల నుంచి చివరి మెట్రోలు బయలుదేరుతాయి. అయితే డిసెంబర్ 31 రాత్రి నగర వ్యాప్తంగా జరిగే నూతన సంవత్సరం వేడుకలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు మెట్రో సేవలను అర్ధరాత్రి దాటినా కొనసాగించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
మెట్రో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి 1 గంట వరకు చివరి రైళ్లు బయలుదేరనున్నాయి. దీంతో వేడుకలకు వెళ్లే వారు, తిరిగి వచ్చే వారు సౌకర్యంగా ప్రయాణించవచ్చు.
అదే విధంగా, దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించిన ప్రకారం, ఎంఎంటీఎస్ రైళ్లు కూడా రాత్రి ఆలస్యంగా నడపనున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, ఫలక్‌నుమా, లింగంపల్లి వంటి కీలక స్టేషన్ల నుంచి ప్రయాణికుల రద్దీ, అవసరం ఆధారంగా అదనపు సర్వీసులు అందించనున్నట్లు తెలిపారు.
నూతన సంవత్సరం వేడుకల కోసం బయటకు వెళ్లే హైదరాబాద్ ప్రజలకు ఈ రవాణా సేవలు పెద్ద సౌలభ్యంగా మారనున్నాయి.