Tamil Nadu: తమిళనాడులో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం

Tamil Nadu: పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Update: 2023-12-18 05:22 GMT

Tamil Nadu: తమిళనాడులో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం

Tamil Nadu: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడి ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నట్టు సమాచారం. వర్షాల ప్రభావం రైల్వే ప్రయాణాలపై కూడా పడింది. భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాకులు నీట మునిగాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు. అనేక రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కోవిల్‌పట్టి చుట్టుపక్కల ఉన్న నదులు, సరస్సులు పూర్తిగా నిండుకున్నాయి. దీంతో నదులు, సరస్సులు పొంగిపొర్లుతున్నాయి.

భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తున్న తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్‌కాసి జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. ఇక నగరాలతో పాటు విరుధ్‌నగర్ జిల్లాలో కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యా సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు, బ్యాంక్‌లు వంటి వాటికి కూడా భారీ వర్షాల కారణంగా సెలవు ఇచ్చారు. తమిళనాడు, కేరళలో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ప్రధానంగా దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళ, లక్షద్వీప్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ప్రభుత్వం అవసరమైన సహాయక చర్యలు చేపడుతుందని అధికారులు చెప్పారు. SDRF, NDRF బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. కోవిల్‌పట్టి పంచాయతీలోని 40 సరస్సులు పూర్తిగా నిండిపోయాయి. రెండు సరస్సులు దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో సహాయక శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. తిరునల్వేలిలో 19, కన్యాకుమారిలో 4, తూత్తుకుడిలో 2, తెన్‌కాసి జిల్లాలో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News