Gali Janardhan Reddy: గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి ముందు కాల్పులు.. ఒకరు మృతి, హత్యాయత్నమంటూ ఆరోపణ
బళ్లారిలో బ్యానర్ల వివాదం తీవ్రతరం.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి ముందు కాల్పులు. ఒకరి మృతి, ఇది తనపై హత్యాయత్నమని మాజీ మంత్రి ఆరోపణలు.
Gali Janardhan Reddy: గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి ముందు కాల్పులు.. ఒకరు మృతి, హత్యాయత్నమంటూ ఆరోపణ
కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి నివాసం ముందు చోటుచేసుకున్న కాల్పుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. బళ్లారి జిల్లా హవంబావి ప్రాంతంలో రెండు రాజకీయ వర్గాల మధ్య చెలరేగిన బ్యానర్ల వివాదం హింసాత్మక ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
జనవరి 3న బళ్లారిలో వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో నగరమంతటా బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, బళ్లారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు హవంబావి ప్రాంతంలో బ్యానర్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించగా, గాలి జనార్ధన్ రెడ్డి నివాసం ప్రహరీ వద్ద వివాదం తలెత్తింది. బ్యానర్ల ఏర్పాటుపై జనార్ధన్ రెడ్డి మద్దతుదారులు అభ్యంతరం చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ వివాదం క్రమంగా రాళ్ల రువ్వుడుకు దారి తీసి, పరిస్థితి హింసాత్మకంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే కొందరు పోలీసులపైనా రాళ్లు విసరడంతో పోలీసులు లాఠీచార్జ్‌కు పాల్పడ్డారు.
అదే సమయంలో గంగావతి నుంచి హవంబావిలోని తన నివాసానికి చేరుకున్న గాలి జనార్ధన్ రెడ్డిని కాంగ్రెస్ మద్దతుదారులు చుట్టుముట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ గందరగోళం మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు ఎవరు జరిపారన్న దానిపై ఇంకా స్పష్టత లేదని అధికారులు వెల్లడించారు. పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం.
ఈ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి స్పందిస్తూ, గాలి జనార్ధన్ రెడ్డి మద్దతుదారులే హింసకు కారణమని ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన వారితో పాటు జనార్ధన్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు గాలి జనార్ధన్ రెడ్డి ఈ ఘటనను తనపై జరిగిన హత్యాయత్నంగా అభివర్ణించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి, అతని తండ్రి సూర్యనారాయణ రెడ్డి ఈ దాడికి కుట్ర పన్నారని ఆరోపించారు. బ్యానర్ల వివాదాన్ని సాకుగా తీసుకుని తనను హత్య చేయాలనే ఉద్దేశంతో ఈ దాడి జరిగిందన్నారు. తన నివాసం సమీపంలో లభించిన కాల్చిన బుల్లెట్లను కూడా ఆయన చూపించారు.
ఈ ఘటనపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో గాలి జనార్ధన్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బళ్లారి జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు.