Ever Given Ship: 'ఎవర్ గివెన్' నౌకను జప్తు చేసిన ఈజిప్టు

Ever Given Ship: 'ఎవర్ గివెన్'కు ఈజిప్టు న్యాయస్థానం ఏకంగా రూ. 7500 కోట్ల (100 కోట్ల డాలర్లు) జరిమానా విధించింది.

Update: 2021-04-14 05:58 GMT

Ever Given Ship:(File Image)

Ever Given Ship: సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయి ప్రపంచ నౌకా వాణిజ్యానికి భారీ నష్టం కలిగించిన ఎవర్ గివెన్ నౌకను ఈజిప్టు ప్రభుత్వం సీజ్ చేసింది. వివరాల్లోకి వెళితే... గత నెల 23న ప్రమాదవశాత్తు సూయజ్ కాలువలో ఇరుక్కుపోయి వందలాది నౌకలు నిలిచిపోవడానికి కారణమైన రవాణా నౌక 'ఎవర్ గివెన్'కు ఈజిప్టు న్యాయస్థానం ఏకంగా రూ. 7500 కోట్ల (100 కోట్ల డాలర్లు) జరిమానా విధించింది. నౌక నిలిచిపోవడం కారణంగా నౌకా వాణిజ్యానికి భారీ నష్టం కలిగిందన్న కారణంతో ఈ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని చెల్లించే వరకూ వదిలిపెట్టబోమని ఈజిప్ట్ స్పష్టంచేసింది.

అయితే ఈ జరిమానాను ఎవర్ గివెన్ యాజమాన్యం చెల్లించేందుకు ఇష్టపడకపోవడంతో నౌకను ప్రభుత్వం జప్తు చేసుకుంది. ఈ నౌక వల్ల తమకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లిందని ఈజిప్ట్‌ ప్రభుత్వం వెల్లడించింది. తాము ఖర్చులను మాత్రమే అడుగుతున్నామని.. అసలు నష్టాన్ని కాదంటూ ఈజిప్ట్‌ పేర్కొంది. పరిహారం చెల్లిస్తేనే తమ జలాల నుంచి ఎవర్‌ గివెన్‌ నౌక కదులుతుందని స్పష్టంచేసింది. సూయజ్ కాలువలో వారంపాటు నిలవడం వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని వెల్లడించింది.

ఈ ఎవర్‌ గివెన్‌ నౌక విషయమై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఆసియా, యూరప్‌ల మధ్య పెద్ద ఎత్తున సరుకులు రవాణా చేసే నౌక సూయజ్ కాలువలో చిక్కుకుపోవడంతో అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. నౌకకు సంబంధించిన ఓ భాగం భూమిలో కూరుకుపోవడంతో దీన్ని తిరిగి కాలవలోకి తీసుకొచ్చేందుకు దాదాపు వారం రోజులు శ్రమించారు. భారీ నౌకకు ఇప్పట్లో కష్టాలు గట్టెక్కేలా లేవు. సూయజ్ కాలువను ఖాళీ చేసినప్పటికీ ఈజిప్టును విడిచి వెళ్లడానికి అనుమతి లేదు.

Tags:    

Similar News