Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’తో డీఆర్డీవో ఆయుధాల సత్తా ప్రపంచానికి తెలిసింది.. రాజ్‌నాథ్ సింగ్
Operation Sindoor: ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఆయుధ వ్యవస్థలు నిర్ణయాత్మక పాత్ర పోషించాయని, దేశీయంగా తయారైన ఆయుధాల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
Rajnath Singh: ‘ఆపరేషన్ సిందూర్’తో డీఆర్డీవో ఆయుధాల సత్తా ప్రపంచానికి తెలిసింది.. రాజ్‌నాథ్ సింగ్
Operation Sindoor: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) 68వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంస్థ సేవలను కొనియాడారు. ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఆయుధ వ్యవస్థలు నిర్ణయాత్మక పాత్ర పోషించాయని, దేశీయంగా తయారైన ఆయుధాల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందని ఆయన అన్నారు. ఇది డీఆర్డీవో నిబద్ధతకు నిదర్శనమని ప్రశంసించారు.
గురువారం ఢిల్లీలోని డీఆర్డీవో ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘సుదర్శన చక్ర’ రూపకల్పనలో డీఆర్డీవో కీలక పాత్ర పోషించనుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ కింద దేశంలోని కీలక సంస్థాపనలకు సంపూర్ణ వైమానిక రక్షణ కల్పించే బాధ్యతను డీఆర్డీవోకు అప్పగించినట్లు తెలిపారు. ఆధునిక యుద్ధాల్లో ఎయిర్ డిఫెన్స్ ప్రాముఖ్యతను ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో చూశామని, ఈ లక్ష్యాన్ని డీఆర్డీవో త్వరలోనే సాధిస్తుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.
రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, సాయుధ బలగాలకు అత్యాధునిక సాంకేతికతను అందించడంలో డీఆర్డీవో చేస్తున్న కృషి అమోఘమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. డీఆర్డీవో శాస్త్రవేత్తల అచంచలమైన నిబద్ధత, శాస్త్రీయ నైపుణ్యం దేశ రక్షణ సన్నద్ధతకు మూలస్తంభాలని పేర్కొన్నారు.
ప్రైవేట్ రంగం, విద్యాసంస్థలు, స్టార్టప్‌లతో కలిసి పనిచేయడం ద్వారా దేశంలో ఒక బలమైన రక్షణ పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతోందని అభినందించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆవిష్కరణలపై మరింత దృష్టి సారించాలని, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించారు. భవిష్యత్ టెక్నాలజీలకు అనుగుణంగా నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని డీఆర్డీవో శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు.