Gig Workers Strike: 15గంటల పనికి 600 రూపాయలు..నేడు డెలివరీ బాయ్స్ సమ్మె.. కంపెనీల బెదిరింపులు..!!
Gig Workers Strike: 15గంటల పనికి 600 రూపాయలు..నేడు డెలివరీ బాయ్స్ సమ్మె.. కంపెనీల బెదిరింపులు..!!
Gig Workers Strike: నేడు ఆన్ లైన్ డెలివరీ సర్వీసులు నిలిచిపోనున్నాయి. కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేసే గిగ్ వర్కర్లు సమ్మె నిర్వహిస్తున్నారు. దీంతో జొమాటో, స్విగ్గీ, జెప్టో, బ్లింకింగ్ వంటి ఈ కామర్స్ సైట్లలో డెలివరీ సర్వీసులు నిలిచిపోనున్నాయి. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ సంస్థలకు చెందిన డెలివరీ ఏజెంట్లు ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో సుమారు 1.5 లక్షల మంది డెలివరీ పార్ట్‌నర్లు పాల్గొనే అవకాశం ఉందని యూనియన్లు వెల్లడిస్తున్నాయి. వేతనాలు, ప్రోత్సాహకాలు, పని గంటలు, ఉద్యోగ భద్రత వంటి అనేక సమస్యలపై తమ నిరసనను వ్యక్తం చేయడానికి ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
డెలివరీ ఏజెంట్ల ఆరోపణల ప్రకారం.. కంపెనీలు ఇటీవలి కాలంలో పారితోషికాలను తగ్గించడంతో పాటు, ఇంధన ఖర్చులు, వాహన నిర్వహణ భారం మొత్తం డెలివరీ పార్ట్‌నర్లపైనే మోపుతున్నాయి. అంతేకాదు, ఎక్కువ గంటలు పని చేయించినప్పటికీ సరైన ఇన్సెంటివ్‌లు ఇవ్వడం లేదని వారు అంటున్నారు. ఈ పరిస్థితులకు నిరసనగా సమ్మెకు దిగితే, తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని యూనియన్లు ఆరోపిస్తున్నాయి.
సమ్మెలో పాల్గొంటే మళ్లీ పనిలోకి రానీయకుండా ఐడీలు బ్లాక్ చేస్తామని కంపెనీలు హెచ్చరిస్తున్నట్లు డెలివరీ బాయ్స్ చెబుతున్నారు. దీంతో చాలా మంది డెలివరీ ఏజెంట్లు భయంతో సమ్మెలో పాల్గొనాలా, లేక పని కొనసాగించాలా అనే సందిగ్ధంలో ఉన్నారని యూనియన్ నేతలు పేర్కొన్నారు.
మరోవైపు, సమ్మె ప్రభావం తగ్గించేందుకు కొన్ని కంపెనీలు వేరే వ్యూహాలను అమలు చేస్తున్నట్లు సమాచారం. వర్క్ కొనసాగించాలని సూచిస్తూ సెలబ్రిటీలతో ప్రకటనలు చేయించడం, సోషల్ మీడియా ద్వారా డెలివరీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయనే ప్రచారం చేయడం మొదలుపెట్టాయని తెలుస్తోంది. దీని ద్వారా కస్టమర్లలో గందరగోళం లేకుండా చూసుకోవడమే కాకుండా, డెలివరీ పార్ట్‌నర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ సమ్మె ప్రభావంతో పలు నగరాల్లో ఫుడ్ డెలివరీలు, ఆన్‌లైన్ ఆర్డర్లు ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డెలివరీ ఏజెంట్ల డిమాండ్లపై కంపెనీలు ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.