Explainer: పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల ఆగ్రహానికి కారణమైన బిల్లులు, వివాదాలు

Update: 2025-03-10 08:01 GMT

Parliament budget sessions 2025 : పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల ఆగ్రహానికి కారణమైన బిల్లులు, వివాదాలు

Parliament Budget Sessions 2025: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. సెంట్రల్ బడ్జెట్ రెండో విడత పార్లమెంట్ సమావేశాలు ఇవాళే మొదలయ్యాయి. నేటి నుండి ఏప్రిల్ 4 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. అయితే, ఈ సమావేశాలు ప్రారంభం అవడంతోనే విపక్షాలు ఆందోళనకు దిగాయి. హిందీ ఇంపోజిషన్, వక్ఫ్ చట్టానికి సవరణల బిల్లు, భారత్‌పై అమెరికా ఎక్కువ సుంకం విధింపు వంటి అంశాలను విపక్షాలు లేవనెత్తాయి. ఇదే విషయమై విపక్షాలు పార్లమెంట్ నుండి వాకౌట్ చేశాయి.

పార్లమెంట్ సమావేశాల నుండి విపక్షాల వాకౌట్ చేయడాన్ని రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపి నడ్డా ఖండించారు. "పార్లమెంట్ ఎలా పనిచేస్తుంది, నిబంధనలు ఏంటనే విషయంలో వారికి రిఫ్రెషర్ కోర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది" అని నడ్డా వ్యాఖ్యానించారు.

అసలు పార్లమెంట్‌లో ఆందోళనకు దారితీసిన అంశాలు ఏంటంటే...

డిలిమిటేషన్ -

కేంద్రం వచ్చే ఏడాది జనాభా లెక్కింపు చేపట్టనుంది. ఆ తరువాత డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టనుంది. అయితే, ఈ డీలిమిటేషన్ ను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా పెరగకుండా కేంద్రం ఇచ్చిన కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంతో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని, ఫలితంగా ఉత్తరాదితో పోలిస్తే తమ రాష్ట్రాలకు పార్లమెంట్ స్థానాలు కూడా తగ్గుతాయని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోపిస్తున్నారు.

ముఖ్యంగా తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు.

డిలిమిటేషన్ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సమగ్రమైన వార్తా కథనం కోసం ఈ వీడియో వీక్షించండి.

Full View

వక్ఫ్ చట్టానికి సవరణల బిల్లు -

వక్ఫ్ చట్టంలో పలు సవరణలు తీసుకొస్తూ కేంద్రం ఓ కొత్త వక్భ్ బిల్లు రూపొందించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్రం ఈ కొత్త వక్ఫ్ సవరణల బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. అయితే, ఈ బిల్లులో కొన్ని సవరణలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. కొన్ని ముస్లిం సంఘాలు కూడా ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ముస్లింల హక్కులను హరించడం కోసమే ఈ కొత్త వక్ఫ్ సవరణల బిల్లు తీసుకొస్తున్నారని విపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వక్ఫ్ బోర్డులో ముస్లింయేతర వ్యక్తులకు అవకాశం కల్పించేలా ఉన్న కొన్ని సవరణలను వారు వ్యతిరేకిస్తున్నారు.

వక్ఫ్ బిల్లులో కొత్తగా చేసిన సవరణలు ఏంటి? ఎందుకు కొంతమంది ముస్లింలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారో చెప్పే సమగ్రమైన వార్తా కథనం కోసం ఈ వీడియో వీక్షించండి.

Full View

హిందీ భాషపై వివాదం -

దేశవ్యాప్తంగా పాఠశాలల్లో హిందీ భాషను తప్పనిసరి చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని తమిళనాడు సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉత్తరాది భాషను తీసుకొచ్చి తమ నెత్తిన రుద్దొద్దని తమిళనాడు సర్కారు అభిప్రాయపడుతోంది. ఈ విషయంలోనూ సీఎం ఎం.కే. స్టాలిన్ కేంద్రానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నడిపిస్తున్నారు.

అయితే, స్టాలిన్ వైఖరిని కేంద్రం తప్పుపడుతోంది. కేంద్ర విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ స్టాలిన్ తమిళనాడు విద్యార్థుల శ్రేయస్సును కోరుకోవడం లేదన్నారు. అందుకే వారి అభివృద్ధికి అడ్డంపడేలా హిందీ భాషను అడ్డుకుంటున్నారని ప్రధాన్ అభిప్రాయపడ్డారు. దీంతో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో డిఎంకే సభ్యులు ఈ వివాదంపై కూడా ఆందోళన చేస్తున్నారు.

డోనల్డ్ ట్రంప్ తీరుపై నిరసన

ఇక పార్లమెంట్ సమావేశాల్లో కాకరేపుతున్న మరో అంశం భారత్ పట్ల అమెరికా అనుసరిస్తోన్న వైఖరి. అమెరికాలో అక్రమ వలసదారులుగా ఉన్న భారతీయులను డిపోర్ట్ చేసే క్రమంలో వారికి సంకెళ్లు వేసి పంపడాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికాపై భారత ప్రభుత్వం నిరసన తెలపాల్సిందిగా డిమాండ్ చేశాయి.

ఈ వివాదం ఇలా ఉండగానే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సుంకం విషయంలో భారత్‌ను పదేపదే తప్పుపడుతూ మాట్లాడటంపై కూడా విపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి.

Full View

ఈ అంశాలతో పాటు డూప్లికేట్ ఓటర్ ఐడీ నెంబర్స్, మణిపూర్‌లో ప్రెసిడెంట్ రూల్ విధింపు, ఫైనాన్స్ బిల్లు వంటి అంశాలపై విపక్షాలు చర్చకు డిమాండ్ చేస్తున్నాయి.

Tags:    

Similar News