Delhi Gun Firing: ఢిల్లీలో కాల్పుల కలకలం.. 12 రౌండ్లకు పైగా కాల్పులు
దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. పార్కింగ్‌లో ఉన్న కారుపై 12 రౌండ్లకు పైగా కాల్పులు జరగగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Delhi Gun Firing: ఢిల్లీలో కాల్పుల కలకలం.. 12 రౌండ్లకు పైగా కాల్పులు
Delhi Gun Firing: దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. నగరంలోని రోహిణి ప్రాంతంలో పార్కింగ్‌లో ఉన్న ఓ కారును లక్ష్యంగా చేసుకుని దుండగులు 12 రౌండ్లకు పైగా కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అక్కడి నుంచి డజన్ల కొద్దీ బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కాల్పుల ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని పోలీసులు స్పష్టం చేశారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. మోటార్‌బైక్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఓ వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతర్జాతీయ నంబర్ నుంచి వాట్సాప్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చాయని, కాల్ చేసిన వ్యక్తి తనను పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా పరిచయం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
డబ్బులు ఇవ్వనందుకే బెదిరింపులలో భాగంగా ఈ కాల్పులు జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇటీవల ఎర్రకోట ఘటన నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ తాజా ఘటనతో ఎలాంటి ఉగ్రకోణం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో రాజధానిలో భద్రతను మరింత పెంచినట్లు అధికారులు తెలిపారు.