Delhi Election Results: మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ..ముందంజలో కేజ్రీవాల్
Delhi Election Results: ఢిల్లీ అధికార పీఠం ఎవరికి దక్కుతుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది. నేడే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాజధానిలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. పోలింగ్ ఆసక్తిగా జరగడంతో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల్లో ఏది గెలుస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. నేడు ఉదయం 8గంటలకు ఓట్ల కౌంటింగ్ షురూ అయ్యింది.
కాగా మూడో రౌండ్ ముగిసే సరికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేవలం 343ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్ కౌంటింగ్ తర్వాత ఆయనకు 6,442 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మకు ఇప్పటి వరకు 6,099ఓట్లు వచ్చాయి. ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బ్యాండ్లు, సంగీతంతో హాజరయ్యారు. తాజా ట్రెండ్స్ ప్రకారం, బిజెపి 42 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
కల్కాజీ స్థానంలో బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ప్రకారం, రమేష్ బిధురి ప్రస్తుతం అతిషిపై ఆధిక్యంలో ఉన్నారు.బిజ్వాసన్ అసెంబ్లీ స్థానం నుంచి బిజెపికి చెందిన కైలాష్ గెహ్లాట్ 12 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.మాల్వియా నగర్ అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సోమనాథ్ భారతి వెనకంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లే కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఇప్పటికీ ఖాతా తెరవలేదు.