Congress: నామినేటెడ్ పదవులపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ సర్కార్
Congress: పార్టీకోసం పనిచేసిన వారికోసం త్వరలోనే పదవులు భర్తీ
Congress: నామినేటెడ్ పదవులపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ సర్కార్
Congress: పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఎన్నికలకు సన్నద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఓ వైపు ఎన్నికలకు ప్రిపేర్ అవుతూనే.. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్ళారు తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీ, కార్పొరేషన్ చైర్మన్‌ల ప్రక్రియ, కేబినెట్ విస్తరణ లాంటి అంశాలు ఢిల్లీ పెద్దలతో చర్చించినట్లు సమాచారం. హైకమాండ్ ఓకే అంటే తక్షణమే పదవుల భర్తీ జరుగుతుందంటున్నారు గాంధీ భవన్ పెద్దలు. అయితే ఇప్పటికే వాటికి జరగాల్సిన కసరత్తు అంతా పూర్తయిందంటున్నారు కాంగ్రెస్ పెద్దలు.
ఈనెల 19 వ తేదీ ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు రాష్ట్రంలో ఉన్న పాలనాపరమైన సమస్యలను కొంత మంది కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. వారిని కలిసి రాష్ట్ర సమస్యలు వివరించారు. ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్ళడం పాటు ఢిల్లీ పెద్దలను కలవడంపై గాంధీ భవన్‌లో చర్చకు దారి తీసింది. ముగ్గురు కీలక నేతలు ఢిల్లీకి వెళ్ళడంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవులు, కేబినెట్ విస్తరణపై కూడా ఏఐసీసీ పెద్దలను కలిసి చర్చించారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికే వంద రోజులలోపు నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్‌ల ఎంపిక పూర్తవుతుందని తెలిపారు రేవంత్ రెడ్డి. దీంతో ఎన్నికల వేళ పదవులు భర్తీ ఉంటుందని ఆశతో చూస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మరో వైపు పార్టీ పదవులు నామినేటెడ్, కార్పొరేషన్ చైర్మన్‌ల కోసం ఎవరి లాబియింగ్ వారు చేస్తున్నారు.
అయితే వీటితో పాటు కేబినెట్ విస్తరణపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మెజార్టీ కులాలైన మైనార్టీలు, ముదిరాజ్‌లు, యాదవ్‌లకు మంత్రివర్గంలో చోటు కల్పించక పోవడంతో వారు కొంత అసంతృప్తిగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. మరో వైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మెజార్టీ జనాభా అయిన ఆ మూడు కులాలకి కూడా కేబినెట్‌లో స్థానం కల్పించడంపై కూడా ఆలోచన చేస్తున్నారట ఏఐసీసీ నేతలు. అయితే ఎన్నికల ముందు పదవులు భర్తీ చేస్తే పదవులు రాని వారు నిరాశగా ఉంటారనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు అధికారంలోకి వచ్చి 60 రోజులు దాటినా పదవులు భర్తీ చేయలేదనే నిరాశ కొందరి నేతల్లో ఉంటుందని పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో రెండు లేదా మూడు విడతల్లో నామినేటెడ్, కార్పొరేషన్ ఛైర్మన్‌ల పదవులను భర్తీ చేసే ప్రక్రియ ఉంటుందంటున్నారు కాంగ్రెస్ పెద్దలు.