Coal Mine Protest: బొగ్గు గని ప్లాంట్ వద్ద నిరసన హింసాత్మకం.. పోలీసులపై దాడి..!!
Coal Mine Protest: బొగ్గు గని ప్లాంట్ వద్ద నిరసన హింసాత్మకం.. పోలీసులపై దాడి..!!
Coal Mine Protest: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌గఢ్ జిల్లా తమ్నార్ ప్రాంతంలో కోల్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. జిందాల్ కంపెనీ చేపడుతున్న బొగ్గు గనుల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ స్థానిక గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయితే ఈ నిరసన శాంతియుతంగా కొనసాగకపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
నిరసన కారులు జిందాల్ కంపెనీకి చెందిన బొగ్గు నిర్వహణ ప్లాంట్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ప్లాంట్ పరిసరాల్లో ఉన్న పోలీస్ జీపు, ట్రాక్టర్లు సహా పలువురు వాహనాలకు నిప్పంటించారు. ఆస్తులను ధ్వంసం చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించిన పోలీసులపై నిరసన కారులు రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ ఘర్షణల్లో కనీసం 10 మంది పోలీసులు గాయపడగా.. పలువురు గ్రామస్థులు కూడా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. వెంటనే అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.
ఈ కోల్ మైనింగ్ ప్రాజెక్టు వల్ల తమ భూములు, అడవులు, జీవనాధారాలు నష్టపోతాయనే భయం ఉందని స్థానికులు వాపోతున్నారు. పర్యావరణానికి హాని కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, చట్టం చేతిలోకి తీసుకోవడం సరికాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఘటనపై కేసులు నమోదు చేసి, విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.