లైంగిక వేధింపుల ఆరోపణలపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌కు క్లీన్ చిట్

Update: 2019-05-07 01:25 GMT

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల్ని సుప్రీం కోర్టు అంతర్గత దర్యాప్తు కమిటీ కొట్టిపారేసింది. సీజేఐ రంజన్ గొగోయ్‌పై కోర్టు ఉద్యోగి చేసిన ఆరోపణలు అవాస్తవమని జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని అంతర్గత త్రిసభ్య విచారణ కమిటీ తేల్చింది. ఫిర్యాదులోని ఆరోపణలను బలపరిచే ఆధారాలేవీ లభించలేదని స్పష్టం చేసింది.జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే అధ్యక్షతన ఏర్పాటైన ఈ ఇన్-హౌజ్ కమిటీ విచారణ నివేదికను తాజాగా సమర్పించింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఇందూ మల్హోత్రా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

కమిటీ నివేదిక ఏం తేల్చిందన్నది సీజేఐ సెక్రటరీ జనరల్ ప్రకటన రూపంలో వెల్లడించారు. కాగా సుప్రీంకోర్టులో పని చేసే మహిళా మాజీ ఉద్యోగిని జస్టిస్ రంజన్ గొగోయ్ తనను రెండు సార్లు లైంగికంగా వేధించాడని పేర్కొంటూ 22 మంది సుప్రీంకోర్టుల జడ్జీలకు అఫిడవిట్ సమర్పించింది. గతేడాది అక్టోబరులో చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనను లైంగికంగా వేధించాడని తన అఫిడవిట్‌లో ఆ మహిళ పేర్కొంది. ఈ విషయం బయటపెట్టడంతో తనను ఉద్యోగం నుంచి తొలిగించారని పేర్కొంది. అంతకుముందు జస్టిస్ గొగోయ్ నివాసంలో క్లర్క్‌గా ఆమె పనిచేశారు. 

Similar News