Fertilizer Price Hike: చైనా ఆంక్షల దెబ్బతో ఎరువుల ధరల మంట.. రైతులపై పెరుగుతున్న భారం..!!

Fertilizer Price Hike: చైనా ఆంక్షల దెబ్బతో ఎరువుల ధరల మంట.. రైతులపై పెరుగుతున్న భారం..!!

Update: 2025-12-28 00:53 GMT

Fertilizer Price Hike: చైనా విధించిన ఆంక్షల ప్రభావం భారత వ్యవసాయ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కాంప్లెక్స్ (మిశ్రమ) ఎరువుల ధరలు గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగి రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. రబీ సీజన్‌లో పంటలు సాగు చేస్తున్న అన్నదాతలకు ఇది అదనపు ఆర్థిక భారంగా మారింది.

గణాంకాలను పరిశీలిస్తే.. 2023–24లో 50 కిలోల మిశ్రమ ఎరువుల బస్తా ధర రూ.1,250 నుంచి రూ.1,450 మధ్యలో ఉండేది. కానీ ప్రస్తుతం అదే బస్తా ధర రూ.1,450 నుంచి రూ.1,950 వరకు పెరిగింది. అంటే ఒక్క బస్తాపైనే రూ.100 నుంచి రూ.500 వరకు అదనపు ఖర్చు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద ఎత్తున సాగు చేసే రైతులకు ఇది వేల రూపాయల భారంగా మారుతోంది.

ఇదిలా ఉండగా.. యూరియా, డీఏపీ వంటి కీలక ఎరువుల ధరల్లో ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి పెంపు చేయలేదు. అయినప్పటికీ.. చాలా చోట్ల వ్యాపారులు ఎమ్మార్పీకి మించి ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవసరం ఎక్కువగా ఉండటం, సరఫరా పరిమితంగా ఉండటం వల్ల రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేయాల్సి వస్తోంది.

చైనా నుంచి దిగుమతి అయ్యే ముడి పదార్థాలపై ఆంక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల, రవాణా ఖర్చులు పెరగడం వంటి అంశాలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. వీటి ప్రభావం నేరుగా రైతుల మీదే పడుతోంది.

రబీ సీజన్‌లో గోధుమ, శనగ, ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు ఇప్పటికే విత్తనాలు, నీటి ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎరువుల ధరల పెరుగుదల వారి లాభాలను మరింత తగ్గించే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో ఎరువుల విక్రయాలపై కఠిన పర్యవేక్షణ, ఎమ్మార్పీ అమలు, సరఫరా పెంచే చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

Tags:    

Similar News