వలస కార్మికులకు ఉపాధి మార్గాన్ని చూపించిన కేంద్రం
వలస కార్మికులను పునరావాస కేంద్రాల నుండి పని ప్రదేశాలకు వెళ్లొచ్చని.. వారిని తయారీ యూనిట్లు, పొలాలు వంటి ప్రాంతాలకు సోమవారం నుండి అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది.
వలస కార్మికులను పునరావాస కేంద్రాల నుండి పని ప్రదేశాలకు వెళ్లొచ్చని.. వారిని తయారీ యూనిట్లు, పొలాలు వంటి ప్రాంతాలకు సోమవారం నుండి అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఏ రాష్ట్రంలో ఉన్నవారిని ఆ రాష్ట్రంలోనే ఉంచాలని సూచించింది. ఇది కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా ఆదివారం జారీ చేసిన ఆదేశాల ప్రకారం నాన్-కోవిడ్ -19 కంటైనర్ జోన్లుగా ప్రకటించిన జిల్లాల్లోనే వర్తిస్తుందని పేర్కొంది.
పారిశ్రామిక, తయారీ, నిర్మాణం, వ్యవసాయం, ఎంఎన్‌ఆర్‌ఇజిఎ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం) పనులలో కార్మికులు నిమగ్నమవ్వడానికి ఇది సహాయపడుతుంది. పని ప్రదేశాలకు వెళ్లేముందు సహాయ శిబిరాల్లో నివసిస్తున్న కార్మికుల రిజిస్టర్డ్ వివరాలను సేకరించాలని రాష్ట్రాలను కోరింది కేంద్రం. కార్మికుల రవాణా సమయంలో సామాజిక దూర నిబంధనలను అనుసరించాలని.. కార్మికుల ఉపయోగించే వాహనాలు శుభ్రపరచాలని సూచించింది. స్థానిక అధికారులు వారి (వలస కూలీలు) ప్రయాణంలో ఆహారం, నీరు అందించాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది.