వాళ్ల నాన్న కొత్త బిందె తెచ్చాడట.. లోపల చూసిన బుజ్జాయి ఇరుక్కుపోయాడు! 2 గంటల నరకయాతన
ఒడిశా మల్కాంగిరిలో మూడేళ్ల బాలుడు బిందెలో తల ఇరుక్కుపోయిన ఘటన సంచలనం సృష్టించింది. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు.
వాళ్ల నాన్న కొత్త బిందె తెచ్చాడట.. లోపల చూసిన బుజ్జాయి ఇరుక్కుపోయాడు! 2 గంటల నరకయాతన
చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం వహించరాదని చెప్పే సంఘటన ఇది. ఒడిశా రాష్ట్రంలోని మల్కాంగిరి జిల్లాలోని కోరుకొండ గ్రామంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇంటి అవసరాల కోసం ప్రదీప్ బిశ్వాస్ అనే వ్యక్తి కొత్త బిందె కొనుక్కొచ్చాడు. ఆ బిందెను చూసిన అతని మూడేళ్ల కొడుకు తన్మయ్ దాన్ని బొమ్మలా భావించి ఆడసాగాడు.
ఆటలో భాగంగా పిల్లాడు తల బిందెలో పెట్టి లోపల చూసేందుకు ప్రయత్నించాడు. కానీ తల బయటకు రాక ఇరుక్కుపోయింది. తల బిందెలో ఇరుక్కుపోవడంతో భయపడి తన్మయ్ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా తల బయటకు రాలేదు.
చివరికి కోరుకొండ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానిక సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో పిల్లాడిని మల్కాంగిరి జిల్లా అగ్నిమాపక కేంద్రానికి తరలించారు. అక్కడ దాదాపు రెండు గంటల పాటు శ్రమించి, జాగ్రత్తగా బిందెను రెండు వైపులా కత్తిరించి తల నుంచి తొలగించారు.
ఈ ఆపరేషన్‌లో మల్కాంగిరి అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ కమల్ కుమార్ గౌడ, ఎల్‌ఎఫ్‌ఎఫ్ బసుదేవ్ బివాల్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అదృష్టవశాత్తు పిల్లాడికి ఎలాంటి గాయాలు కాలేదు. చివరకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.