షాకింగ్ న్యూస్ : రూ.68,600 కోట్ల‌ ఢీఫాల్ట‌ర్ల‌ రుణాల‌ను మాఫీ చేసిన ఆర్బీఐ!

పేదవాడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే లోన్ కోసం బ్యాంకుకు వెళితే వంద ప్రశ్నలు వేస్తారు.. అలాంటిది స్థితిమంతులకు మాత్రం ఈజీగా పనిజరుగుతుంది.

Update: 2020-04-29 02:08 GMT

పేదవాడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే లోన్ కోసం బ్యాంకుకు వెళితే వంద ప్రశ్నలు వేస్తారు.. అలాంటిది స్థితిమంతులకు మాత్రం ఈజీగా పనిజరుగుతుంది. వేలకోట్లు లోన్లు తీసుకొని పంగనామాలు పెట్టె బడాబాబులను ఏమి చెయ్యడం చేతకాక రుణమాఫీ చేసేస్తున్నారు. విదేశాల్లో దాక్కున్న దొంగలను పట్టుకోవడం మానేసి సింపుల్ గా డిఫాల్టర్లు అనేసి వదిలేస్తున్నారు. పేదవాడు పైసా పైసా పోగుచేసి దాచుకుంటే రూపాయి వడ్డీ కూడా ఇవ్వని బ్యాంకులు.. కార్పొరేట్ ముసుగులో కంత్రీగాళ్లకు వేలకోట్లు రుణాలు ఇచ్చి చేతులు కాల్చుకుంటున్నాయి.

దేశంలో బ్యాంక్ డీఫాల్ట‌ర్ల‌లో ప్ర‌ముఖులు అయిన 50 మందికి రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ వరాన్ని ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 68,600 కోట్ల రూపాయ‌ల రుణాల‌ను మనస్పూర్తిగా ర‌ద్దు చేసింది ఆర్బీఐ. స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ఈ విష‌యం వెల్లడైంది. 68,600 కోట్ల రూపాయ‌లు అంటే మామూలు విషయం కాదు.. దేశంలో పలు రాష్ట్రాల వార్షిక బ‌డ్జ‌ట్ క‌న్నా ఎక్కువ‌. దేశ రాజధాని ఢిల్లీలో ఇది సంవత్సరం బడ్జెట్.

మాఫీ జాబితాలో పెద్ద పెద్ద సంస్థలే ఉన్నాయి. 5,492 కోట్ల రూపాయలతో గీతాంజలి జెమ్స్ అగ్రస్థానంలో ఉంది. గీతాంజలి తరువాత ఆర్‌ఇఐ ఆగ్రో, రూ .4,314 కోట్లు, విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ రూ .4,076 కోట్లు. అలాగే బాబా రాందేవ్ అండ్ బాల‌కృష్ణ గ్రూప్ కూడా ఈ జాబితాలో ఉంది. ఇక్కడ ఇంకో బాధకలిగించే విశేషం ఏమిటంటే.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కు కూడా 1,943 కోట్ల రూపాయలను మాఫీ చేసింది. ఒక‌వైపు త‌ను తీసుకున్న అప్పుల‌ను వ‌డ్డీ లేకుండా చెల్లించేస్తానంటూ విజ‌య్ మాల్యా మొత్తుకున్నా.. కింగ్ ఫిష‌ర్ ఎయిర్ లైన్స్ కు రుణ‌మాఫీ చేశారు అంటే అస‌లేం జ‌రుగుతున్న‌ట్టు? ఎవరికోసం కోసం బ్యాంకులు పనిచేస్తున్నట్టు?

మరో మోసకారి అయిన మెహుల్ చోక్సీ యాజమాన్యంలోని గీతాంజలి రత్నాలు స్టాక్ మార్కెట్లలో డార్లింగ్ అన్న విషయం అందరికి తెలిసిందే. అటువంటి సంస్థకు లాస్ వచ్చిందని వాడు చెప్పగానే డీపౌల్టర్ల జాబితాలో కలిపేసింది. నీరవ్ మోడీ కుంభకోణం బహిరంగం అయిన వెంటనే, బ్యాంకులను మోసం చేయడానికి మామ అల్లుళ్ళు అయిన చోక్సీ, మోడీలు ఒకే వ్యూహాలను ఉపయోగించారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) వ్యాఖ్యానించింది. బ్యాంకులకు ఎగనామం పెట్టి ఇద్దరు విదేశాల్లో దాక్కున్నారు.. ఇప్పుడేమో చోక్సీ సంస్థకు వేలకోట్లు మాఫీనా?

ఇక్కడ మ‌రో ప్ర‌హ‌స‌నం ఏమిటంటే.. గ‌త కొన్నేళ్లలో రాందేవ్ బాబా వ్యాపార సామ్రాజ్యం భారీగా విస్తరించిందని మనం వింటూనే ఉన్నాం. ఇలాంటి కంపెనీకి కూడా ఏకంగా 2212 కోట్ల రూపాయ‌ల రుణాల‌ను మాఫీ చేశారు. వీరే కాక ఇంకా ఎంతమంది ఇటువంటి జాబితాలో ఉన్నారో రాబోయే రోజులలోనే తెలుస్తోంది. ఏది ఏమైనా బ్యాంకులలో ఇలా జరుగుతుండటం చూస్తుంటే సక్రమంగా రుణాలు కట్టేవారికి కోపం రాకమానదు.


Tags:    

Similar News