Oldest elephant: ఆసియాలో అత్యంత వృద్ధ ఏనుగు వత్సల మృతి… పన్నా టైగర్ రిజర్వ్‌లో విషాదం
Oldest elephant: పన్నా టైగర్ రిజర్వ్‌కు గర్వకారణంగా నిలిచిన ‘దాదీ మా’ వత్సల అనే వృద్ధ ఆడ ఏనుగు కన్నుమూసింది
Oldest elephant: ఆసియాలో అత్యంత వృద్ధ ఏనుగు వత్సల మృతి… పన్నా టైగర్ రిజర్వ్‌లో విషాదం
Oldest elephant: పన్నా టైగర్ రిజర్వ్‌కు గర్వకారణంగా నిలిచిన ‘దాదీ మా’ వత్సల అనే వృద్ధ ఆడ ఏనుగు కన్నుమూసింది. వయసు కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో పాటు పలు అవయవాలు విఫలమవడంతో మంగళవారం వత్సల తుదిశ్వాస విడిచిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆమె మృతితో పన్నా అభయారణ్యంలో ఒక శకం ముగిసినట్లయిందని స్థానికులు భావిస్తున్నారు.
అనారోగ్యంతో గత కొంతకాలంగా హినౌతా క్యాంపులో వైద్యం:
వత్సల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. హినౌతా క్యాంపులో పశువైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆమె అకస్మాత్తుగా మంగళవారం మరణించడంతో అటవీ శాఖకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగింది. సమాచారం తెలుసుకున్న పీటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ అంజనా సుచితా టిర్కీ, డిప్యూటీ డైరెక్టర్ మోహిత్ సూద్, వన్యప్రాణి వైద్యులు డాక్టర్ సంజీవ్ గుప్తా ఘటనా స్థలానికి చేరుకుని గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు.
కేరళ నుంచి మధ్యప్రదేశ్ వరకు వత్సల జీవనయానం:
వత్సల జీవితం కేరళలోని నీలంబూర్ అడవుల్లో ప్రారంభమైంది. 1971లో ఆమెను హోషంగాబాద్‌కు తరలించగా, 1993లో పన్నా టైగర్ రిజర్వ్‌కు తీసుకురాగా అక్కడే ఆమె జీవితం నిండిపోయింది. పులుల జాడల అన్వేషణ బృందంలో కీలకంగా పని చేసిన వత్సల, వన్యప్రాణి సంరక్షణలో నిరంతరం తోడ్పాటునిచ్చింది. చివరి వరకు ఇతర ఏనుగులకు సంరక్షకురాలిగా నిలిచింది.
ప్రజా ప్రతినిధుల నుంచి పర్యాటకుల వరకూ శోక సందేశాలు:
వత్సల మృతి పట్ల పన్నా ఎంపీ బ్రీజేంద్ర ప్రతాప్ సింగ్ ఎక్స్ ద్వారా సంతాపం ప్రకటించారు. "వత్సల మరణం భావోద్వేగాన్ని కలిగించే సంఘటన. ఆమె 100 ఏళ్ల అద్భుత ప్రయాణం పన్నాకు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది" అని వ్యాఖ్యానించారు. పన్నా సందర్శించిన పర్యాటకులు సైతం వత్సలతో గడిపిన మధుర క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.