Ballari Tension: బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత..మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డిపై హత్యాయత్నం..!!
Ballari Tension: బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత..మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డిపై హత్యాయత్నం..!!
Ballari Tension: కర్ణాటక రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసేలా బళ్లారి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిన ఘటన సంచలనంగా మారింది. గురువారం రాత్రి బళ్లారి నగరంలోని హవంబావి ప్రాంతంలో ఉన్న ఆయన నివాసం వద్ద ఈ ఘటన జరగడంతో, ఆ ప్రాంతం మొత్తం ఉద్రిక్తతకు కేంద్రంగా మారింది. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం… ఈనెల 3వ తేదీన బళ్లారి ఎస్పీ సర్కిల్‌లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బళ్లారి నగర ఎమ్మెల్యే భరత్‌రెడ్డికి సన్నిహితుడైన సతీశ్‌రెడ్డి, గురువారం సాయంత్రం గాలి జనార్దన్‌రెడ్డి ఇంటి ప్రహరీ వద్ద ఫ్లెక్సీ కట్టేందుకు ప్రయత్నించాడు.
అయితే, ప్రైవేట్ ప్రహరీకి ఫ్లెక్సీలు వద్దని గాలి అనుచరులు సూచించారు. బయట ఏర్పాటు చేసుకోవాలని చెప్పినా, సతీశ్‌రెడ్డి వినిపించుకోలేదు. కుర్చీ తెప్పించుకుని ఇంటి ముందే కూర్చుని, అక్కడే ఫ్లెక్సీ కడతానంటూ పట్టుబట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే సమయంలో గంగావతి నుంచి జనార్దన్‌రెడ్డి బళ్లారి ఇంటికి చేరుకోవడంతో, పరిస్థితి మరింత వేడెక్కింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం తోపులాటగా మారి, చివరకు రాళ్ల దాడులకు దారి తీసింది. ఈ గొడవలో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు చేయడానికి ఇరు వర్గాలకు చెందిన గన్‌మెన్‌లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ సమయంలో సతీశ్‌రెడ్డి ఒక గన్‌మన్ వద్ద నుంచి తుపాకీ లాక్కుని, జనార్దన్‌రెడ్డి వైపు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే అప్రమత్తంగా స్పందించిన జనార్దన్‌రెడ్డి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
అయితే, ఈ కాల్పుల కలకలంలో భరత్‌రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్‌కు బుల్లెట్ తగలడంతో అతడు మృతి చెందాడు. మరోవైపు, సతీశ్‌రెడ్డికీ బుల్లెట్ గాయమై, పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని బెంగళూరుకు తరలించారు.సమాచారం అందుకున్న వెంటనే గాలి వర్గానికి చెందిన మాజీ మంత్రి శ్రీరాములు, కంప్లి ఎమ్మెల్యే సురేశ్‌బాబు, గాలి సోమశేఖర్‌రెడ్డి తదితరులు అక్కడికి చేరుకున్నారు. ఉద్రిక్తత మరింత పెరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే భరత్‌రెడ్డి బళ్లారిలో లేకపోయినా, విషయం తెలిసిన వెంటనే ఆయన నగరానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఈ ఘటనపై గాలి జనార్దన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే భరత్‌రెడ్డి, అతడి తండ్రి సూర్యనారాయణరెడ్డి, సతీశ్‌రెడ్డి లాంటి చిల్లర రౌడీలకు తాను భయపడేది లేదని వ్యాఖ్యానించారు. తనపై కాల్పులు జరిగినప్పుడు పక్కనే పడిన బుల్లెట్‌ను మీడియాకు చూపిస్తూ, ఇది హత్యాయత్నమేనని స్పష్టం చేశారు. వాల్మీకి విగ్రహం పేరుతో అనవసరంగా గొడవలు సృష్టించి, నగరంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. బళ్లారిలో మట్కా, పేకాట, గంజాయి విక్రయాలు బహిరంగంగా సాగుతున్నాయని, ఎమ్మెల్యే వేధింపులు భరించలేక పలువురు పోలీసులు బదిలీలు తీసుకుని వెళ్లిపోయారని ఆయన ఆరోపించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నాయకులను, ముఖ్యంగా తనను టార్గెట్ చేసి హత్యకు కుట్ర పన్నుతున్నారని గాలి జనార్దన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనతో బళ్లారి జిల్లా మొత్తం హై అలర్ట్‌లోకి వెళ్లగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.