Air India Flight: గువాహతిలో ఆగిపోయి హడలెత్తించిన ఎయిర్ ఇండియా.. సాంకేతిక లోపంతో రన్ వే పైనే 18గంటలు
Air India Flight: అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరవకముందే గువాహటి నుండి కోల్ కతా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
Air India Flight: అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరవకముందే గువాహటి నుండి కోల్ కతా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ విమానంలో ప్రయాణిస్తున్న 170 మంది ప్రయాణికులు హడలిపోయారు. దాదాపు 18 గంటల పాటు ఈ విమానం రన్ వే పై నిలిచిపోవడంతో అందరూ వణికిపోయారు. చివరకు వారిని మరో విమానంలోకి ఎక్కించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
శనివారం రాత్రి 9.20 ని.లకు గువాహటి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కోల్ కతాకు వెళ్లాల్సిన విమానం బయలుదేరే సమయంలో విమానంలో ఏదో సాంకేతిక లోపం తలెత్తింది. దీనివల్ల విమానాన్ని రన్ వే పైనే నిలిపివేశారు. దీంతో ప్రయాణికులను కూడా కిందకు దించేసారు. ఆ తర్వాత కాసేపటికి సమస్య తీరడంతో ప్రయాణికులు మళ్లీ విమానం ఎక్కారు. కానీ మళ్లీ మరో సాంకేతిక లోపం వచ్చిందంటూ ప్రయాణికులను కిందకు దించారు. దీనివల్ల ప్రయాణికులు 18 గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమని ఎవరూ పట్టించుకోవడం లేదని, కనీసం తిండి కూడా తమకు ఇవ్వలేదని , చివరకు మరో విమానంలో వెళ్లాల్సి వచ్చిందని ప్రయాణికులు చెప్పారు. అయితే వీరి ఆరోపణలను ఎయిర్ ఇండియా ఖండించింది. నగరంలో ఉన్న బెస్ట్ హోటల్‌లో వీరికి వసతి కల్పించామని చెప్పింది. అయితే ఈ విమానంలో ఎటువంటి లోపం వచ్చిందో మాత్రం వెల్లడించలేదు.
ఇదిలా ఉంటే మరోవైపు లండన్ నుంచి చెన్నైకి బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్ వేస్ బోయింగ్ 787–8 డ్రీమ్ లైనర్ విమానంలోనూ సాంకేతిక లోపం తలెత్తడంతో అకస్మాత్తుగా ఈ విమానాన్ని హీత్రూ విమానాశ్రయానికి మళ్లించారు. ఇలా ఎయిర్ ఇండియా విమానాల్లో లోపాలు బయటపడటం వెనుక అసలు కారణాలు ఏంటనే దానిలో అదికారులు విచారణ చేస్తుంటే ప్రయాణికులు మాత్రం విమానాలు ఎక్కాలంటేనే వణికిపోతున్నారు.