ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు – రక్షణ చర్యలకు పెద్ద అడ్డంకిగా మారిన వేడి
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలకు ఎలా అడ్డంకిగా మారిందో తెలుసుకోండి.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు – రక్షణ చర్యలకు పెద్ద అడ్డంకిగా మారిన వేడి
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash 2025) దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని రేపింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోయింది. తీరా ప్రమాద సమయంలో ఘటనా స్థలంలో 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. ఈ తీవ్ర ఉష్ణోగ్రతలే సహాయక చర్యలను తీవ్రంగా ప్రభావితం చేశాయని పేర్కొన్నారు.
మంటల్లో చిక్కుకున్న విమానం – ప్రాణాల కోసం పోరాటం
ప్రమాద సమయంలో విమానంలో సుమారు 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. విమానం కూలిన వెంటనే ఇంధన ట్యాంక్ పేలిపోయి తీవ్ర అగ్నిగోళం ఏర్పడింది. ఈ వేడిని తట్టుకోలేక పక్షులు, శునకాలు కూడా ఘటనా స్థలంలోనే కాలిపోయాయని అధికారులు తెలిపారు.
ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారుల భయానక అనుభవాలు
“ఇంత తీవ్ర ప్రమాదాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు,” అని ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారి తెలిపారు. “పీపీఈ కిట్లు వేసుకొని ఘటనా స్థలానికి వెళ్లినా, తీవ్ర వేడి కారణంగా సహాయక చర్యలు సవాలుగా మారాయి. శిథిలాలన్నీ మంటల్లో చిక్కుకొని కాలిపోయాయి. కొన్ని మృతదేహాలను గుర్తించడమే అసాధ్యమైంది,” అని పేర్కొన్నారు.
241 మంది ప్రయాణికులు మృతి – డీఎన్‌ఏతో గుర్తింపు ప్రక్రియ
ఈ విషాద ఘటనలో విమానంలో ఉన్న 241 మంది ప్రయాణికులతో పాటు, పక్కనే ఉన్న వైద్య కళాశాల హాస్టల్‌లోని 24 మంది విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు. చాలా మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో, డీఎన్‌ఏ పరీక్షల ద్వారా వారి గుర్తింపుని నిర్ధారించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.