Singer S Janaki Son Death: సీనియర్‌ గాయని ఎస్‌.జానకి ఇంట విషాదం..!

S Janaki: దిగ్గజ గాయని ఎస్. జానకి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

Update: 2026-01-22 06:06 GMT

S Janaki: దిగ్గజ గాయని ఎస్. జానకి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, నేడు కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

మురళీకృష్ణ కేవలం జానకి కుమారుడిగానే కాకుండా, కళారంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. తెలుగు మరియు మలయాళ చిత్రాల్లో నటుడిగానూ రాణించారు. తెలుగులో ‘వినాయకుడు’, ‘మల్లెపువ్వు’ వంటి సినిమాల్లో నటించిన ఆయన, మలయాళ చిత్రం ‘కూలింగ్ గ్లాస్’ కు రచయితగానూ పనిచేశారు.

మురళీకృష్ణ మరణవార్త తెలుసుకున్న ప్రముఖ గాయని కె.ఎస్. చిత్ర సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తంచేశారు. "మురళీకృష్ణ మరణం నన్ను తీవ్ర షాక్‌కు గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను" అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.

గతంలో ఎస్. జానకి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పుకార్లు వచ్చినప్పుడు, మురళీకృష్ణ స్వయంగా స్పందించి ఆ వార్తలను ఖండించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మురళీకృష్ణ మరణంతో జానకి అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆమెకు ధైర్యం చెబుతూ సంతాపం ప్రకటిస్తున్నారు.

Tags:    

Similar News