ప్రేమకు వయసుతో సంబంధం ఏమిటీ? అంటున్న మహేష్ బాబు ''జీ తెలుగులో ఇక పండగేనట''.

Update: 2020-01-22 07:42 GMT
Mahesh Babu in Zee Telugu TV Serilas Promo (Images from Zee Telugu Promo Video)

కార్తీకదీపం.. వదినమ్మ.. మౌనరాగం.. గోరింటాకు.. ఆమెకథ.. కథలో రాజకుమారి.. ముద్దమందారం ఇలా ఒకదానిని మించిన ఒక సీరియల్స్ తో తెలుగు మహిళలను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్న మా టీవీ దెబ్బను ఎదుర్కోవడానికి జీ తెలుగు తన సర్వ శక్తులూ ఒడ్డుతోంది. కొత్త షోలు.. సరికొత్త సీరియల్స్ తో వీక్షకులను కట్టిపాడేయటానికి కొత్త పోకడలతో ఉరకలు వేస్తోంది. అందుకు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబును రంగంలోకి దించింది. ఎప్పుడూ ధమ్స్ అప్ తాగమనే మహేష్ బాబు ఇప్పుడు జీతెలుగు సీరియల్స్ చూడమంటూ చెబుతున్నారు.

ఇటీవల జీ తెలుగు కొత్త సీరియల్స్ ని ప్రసారం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా త్రినయని, తూర్పు- పడమర, ప్రేమ ఎంత మధురం అని మూడు సీరియల్స్ అతి త్వరలో ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంది. ఇక వాటికి ప్రమోషన్ పనులు మొదలు పెట్టింది. ఇందుకోసం మహేష్ బాబును ఆయన లేటెస్ట్ హిట్ సరిలేరు నీకెవ్వరు పాటనూ వాడేసుకుంటోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారిపోయింది.

మహేష్ బాబు రాజకుమారుడిలా కూచుని.. ''మీకు నాకు ఎటువంటి రక్త సంబంధం లేదు.. కాని మీ అభిమానం నన్ను సూపర్ స్టార్‌ని చేసింది. సినిమా నన్ను పరిచయం చేస్తే.. టీవీ నన్ను మీ ఫ్యామిలీ మెంబర్‌ని చేసింది. జీ తెలుగు మీకు నాకు మధ్య వారధి''ఈ ప్రోమోలో కనిపించి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అంతేనా.. ఆ కుర్చీలోంచి లేచి ముందుకు మహేష్ బాబు కదులుతుంటే.. సూర్యుడివో చంద్రుడివో అంటూ సరిలేరు.. సినిమాలోని హిట్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించారు. కొంచెం ముందుకు వెళ్ళాకా ప్రదీప్ మహేష్ కు జత కలిశారు. ఇక అక్కడ నుంచి ఒక్కో సీరియల్ లోని ముఖ్య పాత్రల స్వభావాన్ని మహేష్ కు ప్రదీప్ పరిచయం చేస్తూ ప్రోమో సాగింది.

ఆమెకు అన్నే ముందే తెలిసిపోతాయాట!


మొదట మహేష్ బాబు వస్తుండగా మూడో కన్నుతో ధ్యానంలో ఉన్న ఒక స్త్రీ తారస పడుతుంది. ఆమె దగ్గర మహేష్ ఆగి ఆమెను పలకరిస్తే.. కళ్ళు తెరిచిన ఆమె బాబుగారూ మీరు వస్తారని ముందే తెలుసండీ అంటుంది.. దానికి ఆశ్చర్యపోయిన మహేష్ బాబు ప్రదీప్ ని ఎలా అని అడిగితె.. ఈమెతో ఇదే ప్రోబ్లం సర్.. జరగబోయేవన్నీ ఆమెకు ముందే తెలిసిపోతుంటాయి.. ఇంతకీ ఇది వరమా..శాపమా సర్ అని మహేష్ ను ప్రదీప్ అడుగుతారు. దానికి మహష్ బాబు అది తెలియాలంటే ''త్రినయన'' సీరియల్ చూడాలి అంటారు. 

ఒకరికి అనుమానం ఎక్కువ..మరొకరికి నమ్మకమేక్కువ..ఇద్దరూ తూర్పు-పడమర 


ఇక అక్కడ నుంచి ముందుకు సాగిన మహేష్ ప్రదీప్ లకు ఇద్దరు మహిళలు ఎదురెదురుగా కూచుని వాదులాడుకోవడం కనిపిస్తుంది. ప్రదీప్ అక్కడ మహేష్ బాబును ఆపి ఇదీ సర్ సంగతి ఆమె పేరు లయ నమ్మకం ఎక్కువ.. ఈమె పీరు శృతి అనుమానం ఎక్కువ ఈ ఇద్దరి కథ ఏమిటీ అంటారు. దానికి మహేష్ బాబు ఇది ప్రతి ఇంట్లోనూ ఉండేదే కదా.. ''తూర్పూ-పడమర'' మీ జీ తెలుగులో అంటారు.

ప్రేమకు వయసుతో సంబంధం ఏమిటీ?


ముచ్చటగా మూడోది.. ఒక యువకుడు పియోనో వాయిస్తుంటాడు.. పక్కనే ఒక సొగసరి అతనిని ఆరాధనగా చూస్తుంటుంది. ప్రదీప్ వారిని పరిచయం చేస్తూ.. హీ ఈస్ ఆర్య 40 ఇయర్స్.. షి ఈస్ రమ్య 19 ఇయర్స్.. ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇది వర్కౌట్ అవుతుందంటారా? అంటూ అడుగుతారు. దానికి సూపర్ స్టార్ వెంటనే..ఎందుకు కాదు.. ప్రేమకు వయసుతో సంబంధం ఏముంటుంది అని అంటూ చూడండి ''ప్రేమ ఎంత మధురం'' అని చెబుతారు.

ఇక మూడిటినీ పరిచయం చేసిన మహేష్ చివరలో ''కొత్త బంధాలతో మన జీతెలుగులో ఇక పండగే!'' అంటూ ముగిస్తారు.


Full View

అదండీ సంగతి! ఇప్పటికే మాటీవీ సీరియల్స్ తో బిజీ అయిన మహిళామణులు ఇక త్వరలో జీతెలుగు సీరియల్స్ కు కూడా సిద్ధం అయిపోవాల్సిందే. ఇదిలా ఉంటె, ఇప్పుడు ఈ ప్రోమో పై యుట్యూబ్ లో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. 

Tags:    

Similar News