ఇక నుంచి ఆ 'సీన్లు' సినిమాల్లో కనిపించవు..

ఈ సినిమాలకు ఏమైంది? ఒకవైపు హద్దులు మీరిన ముద్దులు..మరోవైపు చెలరేగిపోయి హగ్గులు.

Update: 2020-05-29 04:21 GMT

ఈ సినిమాలకు ఏమైంది? ఒకవైపు హద్దులు మీరిన ముద్దులు..మరోవైపు చెలరేగిపోయి హగ్గులు.అనుకుని సగటు సినీప్రేమికులు చాలాసార్లు బాధపడి ఉంటారు. వారందరి బాధ కరోనా తీర్చింది. ముద్దులు మితిమీరడం కాదు.. కనీసం ముద్దు కూడా పెట్టుకున్నట్టు చూపించే ఛాన్స్ ఇక సినిమాలకు ప్రస్తుతం ఉండదు. పెగ్గేసి హగ్గు చేసుకుని రోడ్లమీద విచ్చల విడి తనాన్ని చూపించే ఛాన్స్ ఇక సినిమాలకు లేదు. ఎప్పుడో 60 దశకాల్లో చూపించినట్టు చెట్టు చాటుకి వెళ్ళాకా ఆకులు కదిలిపోవడమే రొమాటిక్ సీన్లుగా ఇక ముందు కనిపిస్తాయి.

అవును.. కరోనా ఎఫెక్ట్ తో లాక్డౌన్ తీసుకురాబోతున్న మార్పిది. ఇన్నాళ్లలా మొత్తం ముద్దు, రొమాంటిక్ సీన్లతో నింపేసి సినిమా తీసేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఈ సీన్లు తీసేప్పుడు హీరో, హీరోయిన్లు దగ్గరగా ఉంటేనే కాని, వీటిని తీయడానికి కుదరదు. ఇలాంటి ఘటనలు లాక్ డౌన్ నిబంధనలు ప్రకారం విరుద్ధం. ఇదేకాదు.. ఇలాంటి సమయాల్లో ఒకరి నుంచి వేరొకరికి ఈ కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇలా వారిద్దరిలో ఈ వైరస్ ప్రవేశిస్తే అక్కడ ఉండే యూనిట్ మొత్తానికి వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే పాత్రధారులంతా దూరం, దూరంగా ఉంటూ తమ, తమ పాత్రలు పోషించాలంటూ నిబంధన విధిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు.

సినిమా అంటేనే రంగుల ప్రపంచం.. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్‌ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సర్వసాధారణం. అయితే ఇప్పుడు ఈ రొమాన్స్‌కి కాస్త బ్రేక్‌ పడింది. ముద్దులు.. మురిపాలు కాస్త తగ్గించుకోవాలంటోంది కేంద్రం. ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాకు కూడా ఇవే సూచనలు ఇచ్చింది. ఇటీవల సినిమాల్లో లిప్‌లాక్‌ సీన్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇక వీటికి కూడా బ్రేక్‌ పడనుంది. లిప్‌లాక్‌తో పాటు హీరో హీరోయిన్లు ముద్దులు పెట్టుకోవడం, హగ్‌ చేసుకోవడం కూడా ఇకపై కుదరదు.. హీరో హీరోయిన్లు కాస్త దూరం నుంచే ప్రేమించుకోవాలిప్పుడు.. ముట్టుకోకుండానే ప్రేమను వ్యక్తం చేయాలి.. ఒక ఆర్టిస్ట్‌కి ఇంకో ఆర్టిస్ట్‌కి మధ్య రెండు మీటర్ల దూరం పాటించాలి. సినిమాతో పాటు టీవీ సీరియల్స్‌కి కూడా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇలాంటి అంశాలపై గురవారం జరిగిన సినీ ప్రముఖులు, తెలుగు టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానెళ్ల నిర్వాహకులతో తెలంగాణా హోమ్ సెక్రటరీ రవి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చించారు. 

Tags:    

Similar News