Robin Hood: టాలీవుడ్‌లోకి స్టార్ క్రికెటర్.. రాబిన్ హుడ్‌లో కీలక పాత్ర..
రాబిన్ హుడ్ మూవీలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ పాత్రలో నటించారనే వార్త వైరల్ అవుతోంది. అయితే తాజాగా నిర్మాత రవిశంకర్ ఈ విషయాన్ని తెలియజేశారు.
టాలీవుడ్‌లోకి స్టార్ క్రికెటర్.. రాబిన్ హుడ్‌లో కీలక పాత్ర..
Robin Hood: హీరో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్, నవీన్ ఎర్నేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ పాత్రలో నటించారనే వార్త వైరల్ అవుతోంది. అయితే తాజాగా నిర్మాత రవిశంకర్ ఈ విషయాన్ని తెలియజేశారు.
కింగ్ స్టన్ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న రవిశంకర్.. రాబిన్ హుడ్ సినిమా గురించి స్పందిస్తూ.. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిట్ వార్నర్ ఈ సినిమాలో అతిధి పాత్ర పోషించాడని అన్నారు. తన అనుమతి లేకుండా ఈ సమాచారాన్ని తెలియజేసినందుకు నిర్మాత వెంటనే దర్శకుడు వెంకీ కుడుములకు క్షమాపణలు చెప్పారు. రాబిన్ హుడ్‌తో డేవిడ్ వార్నర్‌ను భారతీయ సినిమాలోకి పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు రవిశంకర్. ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు, సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
డేవిడ్ వార్నర్‌లో ఓ మంచి నటుడు ఉన్నాడు. లాక్‌డౌన్ సమయంలో ఎన్నో టిక్‌టాక్ వీడియో చేసి అలరించాడు. అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబుతో పాటు పలువురు హీరోల పాటలకు స్టెప్పులేస్తూ దక్షిణాది సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా రాబిన్ హుడ్‌లో ఓ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఇంతకీ ఈ సినిమాలో డేవిడ్ పాత్ర ఏంటి..?. ఈ సినిమాకు డేవిడ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే విషయాలను ఆరా తీస్తున్నారు.
టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో తన పాత్ర కోసం నిర్మాతలు డేవిడ్‌కు రూ.50 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారని టాక్. రెమ్యూనరేషన్ విషయంలో డేవిడ్ ఎలాంటి డిమాండ్ చేయలేదని.. సరదా కోసమే ఆయన ఈ పాత్ర చేస్తానని అంగీకరించారని సమాచారం. కానీ నిర్మాతలే ఆయనకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రూ.50 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.