సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో నరేష్ కొత్త ఎనర్జీతో ముందుకొస్తున్నారు. తన కెరీర్‌లో ఇది బెస్ట్ రోల్ అని, సినిమా పూర్తిగా నవ్వులతో నిండి ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ పెళ్లి జరిగే పాత్రపై వచ్చిన జోక్స్‌పై కూడా స్పందించారు.
శర్వానంద్ హీరోగా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన 'నారీ నారీ నడుమ మురారి' జనవరి 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ 'సామజవరగమన'తో నరేష్ 2.0 వెర్షన్ చూశారని, ఇప్పుడు ఈ సినిమాతో నరేష్ 3.0 వెర్షన్ చూడబోతున్నారని చెప్పారు. థియేటర్‌లోకి అడుగుపెట్టిన తర్వాత నవ్వులు ఆగకుండా ఉంటాయని, ఇది తన కెరీర్ బెస్ట్ రోల్ అని పేర్కొన్నారు.
సినిమా గన్ షాట్ హిట్ అవుతుందని జోస్యం చెప్పారు. సినిమాలో తన పాత్రకు రెండో పెళ్లి జరగడం, దానిపై వస్తున్న జోక్స్ గురించి మాట్లాడుతూ "మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేముంది? ఈ కాలంలో ఎంతమంది మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారో చూడండి" అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ అబ్బరాజు టీమ్ కామెడీ సినిమాలకు వరంగా నిలుస్తుందని, జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ సినిమాల స్థాయిలో ఈ చిత్రం నవ్వులు పండిస్తుందని నరేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.