Kona Venkat: అంజలితో రిలేషన్ షిప్.. రూమర్స్ పై స్పందించిన కోన వెంకట్
నటి అంజలికి, నిర్మాత కోన వెంకట్‌కి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే దీనిపై తాజాగా కోన వెంకట్ స్పందించారు.
అంజలితో రిలేషన్ షిప్.. రూమర్స్ పై స్పందించిన కోన వెంకట్
Kona Venkat: సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి చాలా సహజం. ఒక హీరో, హీరోయిన్ కలిసి ఎక్కువ సినిమాలు చేసినా.. లేదంటే హీరోయిన్‌తో నిర్మాత ఎక్కువ సినిమాలు చేసినా వారి మధ్య ఏదో ఉందనే వార్తలు పుట్టుకొస్తుంటాయి. అది నిజమా, కాదా అనేది పక్కన పెడితే.. ఇది చాలా వేగంగా స్ప్రెడ్ అయిపోతుంది. చీమ చిటుక్కుమన్నా చాలు సోషల్ మీడియాలో దాని గురించి చర్చలు మొదలవుతాయి. ఇదిగో పులి అంటే అదిగో తొక అంటున్నారు. అలా రూమర్స్ వ్యాపిస్తుంటాయి. నటి అంజలికి, నిర్మాత కోన వెంకట్‌కి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే దీనిపై తాజాగా కోన వెంకట్ స్పందించారు.
రచయితగా, నిర్మాతగా రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు కోన వెంకట్. హీరోయిన్ అంజలితో నిశ్శబ్దం, డిక్టేటర్, గీతాంజలి, గీతాంజలి మళ్లీ వచ్చింది, శంకరాభరణం వంటి సినిమాలు చేశారు. దీంతో ఆయనకు నటి అంజలికి మధ్య రిలేషన్ ఉందనే వార్తలు వినిపించాయి. దీనిపై స్పందించిన కోన వెంకట్.. తనను చెల్లిగా, కూతురిగా, స్నేహితురాలిగా ఎలా పిలవమన్నా పిలుస్తానన్నారు. తన వ్యక్తిగత జీవితం చాలా తక్కువ మందికే తెలుసునన్నారు. తన బాల్యం సంతోషకరంగా సాగలేదన్నారు.పేరెంట్స్ దగ్గర కూడా ఎప్పుడూ లేదని చెప్పారు. తను వాళ్ల పిన్ని దగ్గరే పెరిగిందని, తను కూడా సరిగా చూసుకునేది కాదన్నారు.
తన కూతురికి ఏదైన అవసరం ఉంటే ఎలా అండగా నిలబడతానో అంజలికి కూడా ఎల్లప్పుడూ అలాగే నిలబడ్డానన్నారు. దాన్ని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని.. వాటిని తాను పట్టించుకోనన్నారు కోన వెంకట్. గీతాంజలి సినిమా సమయంలోనే అంజలి తనకు మొదటి సారి పరిచయమైందన్నారు. అదే సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. ఆమె పిన్ని వాళ్లు తన ఆస్తిని కబ్జా చేశారు. అలాంటి సమయంలో ఓ స్నేహితుడిగా పోలీసులతో మాట్లాడి తనకు అండగా నిలబడ్డానని చెప్పారు.
అంజలి తొలిసారి బీఎండబ్ల్యూ కారు కొనుక్కున్నప్పుడు తన చేతుల మీదుగా ఇవ్వమని అడిగిందని.. సరే అని కారు తాళాలు ఇచ్చానన్నారు. దానికి తాను కారు గిఫ్ట్‌గా ఇచ్చినట్టు రూమర్స్ వ్యాపించాయన్నారు. తమ బంధానికి ఏ పేరు పెట్టుకున్నా తాను పట్టించుకోనని చెప్పుకొచ్చారు కోన వెంకట్.