Pushpa 2 Stampede: పుష్ప 2 మూవీ ఘటనతో బెనిఫిట్ షోలపై తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం

Update: 2024-12-06 09:45 GMT

Pushpa 2 Stampede leads to Ban on benefit shows in Telangana: పుష్ప 2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన పుష్ప మూవీ యూనిట్‌తో పాటు పెద్ద హీరోల సినిమాల బెనిఫిట్ షోల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై అనేక ఆరోపణలకు కారణమైంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలపై నిషేధం విధిస్తున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.

పుష్ప 2 మూవీ చూడ్డానికి వెళ్లి సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి మృతి చెందిన ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతురాలి కుటుంబానికి పుష్ప 2 మూవీ నిర్మాతలు కనీసం రూ. 25 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. స్పెషల్ షోలు జరిగే చోట జనం భారీగా పోగవుతుండటంతో అక్కడ తొక్కిసలాటలు చోటుచేసుకొంటున్నాయన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటం కోసమే ఇకపై స్పెషల్ షోలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు కారణమైన పుష్ప 2 మూవీ యూనిట్‌పై చర్యలు తీసుకుని మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా బక్క జడ్సన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

బక్క జడ్సన్ ఫిర్యాదుతో మానవ హక్కుల సంఘం కూడా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి ఘటనపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదంలో పుష్ప 2 లీడ్ యాక్టర్ అల్లు అర్జున్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అల్లు అర్జున్ రాక కారణంగానే ఆయన్ని చూసేందుకు అభిమానులు ఎగబడటంతోనే ఈ తొక్కిసలాట చోటుచేసుకుందనేది కొందరి వాదన. ఇదే విషయమై సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చే నడుస్తోంది.

Tags:    

Similar News