Aditya 369: ఆ అద్భుతం మళ్లీ వస్తోంది.. రీరిలీజ్‌కు సిద్ధమైన ఆదిత్య 369
Aditya 369: నందమూరి బాలకృష్ణ నటించిన క్లాసిక్ మాస్టర్‌పీస్ ‘ఆదిత్య 369’ అప్పట్లో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Aditya 369: ఆ అద్భుతం మళ్లీ వస్తోంది.. రీరిలీజ్‌కు సిద్ధమైన ఆదిత్య 369
Aditya 369: నందమూరి బాలకృష్ణ నటించిన క్లాసిక్ మాస్టర్‌పీస్ ‘ఆదిత్య 369’ అప్పట్లో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 34 ఏళ్ల క్రితం అద్భుతమైన సాంకేతిక విలువలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. 1991 జూలై 18న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈ తరం ప్రేక్షకుల కోసం 4కె డిజిటల్ ఫార్మాట్‌లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ విజ్ఞానప్రధాన చిత్రాన్ని గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పించగా, శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మించారు. భారత సినిమా చరిత్రలోనే తొలి టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌పై వచ్చిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
ఈ సినిమా నిర్మాణానికి ఎంతో మంది ప్రముఖులు తమ అత్యుత్తమ ప్రతిభను అందించారు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్లు పి.సి.శ్రీరామ్, వి.ఎస్.ఆర్. స్వామి, కబీర్ లాల్ కలిసి పని చేశారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్‌గా తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఇళయరాజా అందించిన పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడీ చిత్రాన్ని కొత్త తరం టెక్నికల్ అప్‌గ్రేడ్‌తో కలిపి, 4కె డిజిటలైజేషన్, 5.1 సౌండ్ మిక్సింగ్ ద్వారా సినిమాను మరింత లైవ్‌గా తీర్చిదిద్దారు. ఈ ప్రక్రియలో ప్రసాద్ డిజిటల్ టీమ్ గడచిన ఆరు నెలలుగా ఎంతో కృషి చేసి, ఉత్తమ ఫలితాన్ని అందించిందని నిర్మాత తెలిపారు. ఈ విషయమై నిర్మాత శివలెంక మాట్లాడుతూ.. '34 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమాకున్న క్రేజ్ చూస్తే ముచ్చటేస్తోంది. నేటి యువత ఈ సినిమాను తెరపై ఆస్వాదించాలి అనిపించింది. అందుకే మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నాం. ఇది కేవలం ఒక రీరిలీజ్ కాదు, ఒక చారిత్రక సందర్భం' అని చెప్పుకొచ్చారు.