Tollywood: స్టార్ హీరోలతో నటించి సెన్సేషన్.. ఇప్పుడు రూ.1300 కోట్ల సామ్రాజ్యానికి రాణి!
ఒక్కప్పుడు టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన కథానాయికలలో ఆసిన్ (Asin) ఒకరు.
ఒక్కప్పుడు టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన కథానాయికలలో ఆసిన్ (Asin) ఒకరు. 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ మలయాళీ కుట్టి, దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ అగ్ర హీరోల సరసన నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆసిన్, ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
సిబిఐ అధికారి కూతురిగా సినీ ప్రవేశం:
కొచ్చిలో జన్మించిన ఆసిన్ నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆమె తండ్రి మాజీ సీబీఐ అధికారి కాగా, తల్లి డాక్టర్. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఆసిన్, కేవలం 16 ఏళ్ల వయసులోనే మలయాళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆపై పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. పవన్ కళ్యాణ్, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించి వరుస విజయాలను అందుకుంది.
మైక్రోమ్యాక్స్ బాస్‌తో పెళ్లి.. రూ.1300 కోట్ల ఆస్తి!
2016లో ఆసిన్ ప్రముఖ వ్యాపారవేత్త, మైక్రోమ్యాక్స్ (Micromax) సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకుంది. రాహుల్ శర్మ ప్రస్థానం కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. కేవలం రూ. 3 లక్షల అప్పుతో తన వ్యాపారాన్ని మొదలుపెట్టిన ఆయన, ఇప్పుడు రూ. 1300 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు. భారతదేశంలో మొట్టమొదటి AI-ఆధారిత ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ 'రివోల్ట్ ఇంటెలికార్ప్'ను కూడా ఆయనే ప్రారంభించడం విశేషం.
ప్రస్తుతం ఈ దంపతులకు అరిన్ రెయిన్ శర్మ అనే కుమార్తె ఉంది. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ, ఆసిన్ తన కుటుంబంతో కలిసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు షేర్ చేసే ఫోటోలు చూసి ఆమె అభిమానులు మురిసిపోతుంటారు.