బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు ICU లో చికిత్స
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరోసారి ఆసుపత్రిపాలయ్యారు. పెద్దపేగు ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరోసారి ఆసుపత్రిపాలయ్యారు. పెద్దపేగు ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.దాంతో ICU లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్నీ ఇర్ఫాన్ ఖాన్ ప్రతినిధి వెల్లడించారు. ఇర్ఫాన్ ఖాన్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. పెద్దపేగు ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స తీసుకుంటున్నారని అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు.
ఆయనకున్న సంకల్ప శక్తి, అతని శ్రేయోభిలాషుల ప్రేమానురాగాలతో త్వరలోనే కోలుకుంటారు అని అతను అన్నారు. కాగా ఇర్ఫాన్ ఖాన్ ఇదివరకే న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో అప్పట్లో ఆయన లండన్‌లో చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకుని గత ఏడాది సెప్టెంబర్‌లో ముంబైకి చేరుకున్నారు. ఇంతలో ఇర్ఫాన్ తల్లి సయీదా బేగం మరణించారు. అయితే విషాదకర విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా జైపూర్లో జరిగిన తల్లి అంత్యక్రియలకు హాజరు కాలేదు ఇర్ఫాన్. ఈ క్రమంలో తాను తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలవ్వడం అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది.