Gantasala The Great Movie Review: ఘంటసాల రివ్యూ: ప్రతి తెలుగు వాడు తెలుసుకోవాల్సిన మహానుభావుడి కథ

Gantasala The Great Movie Review: తెలుగు సినీ సంగీత చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోయిన పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు.

Update: 2026-01-02 12:57 GMT

Gantasala The Great Movie Review: తెలుగు సినీ సంగీత చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోయిన పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు. దిగ్గజ సంగీత దర్శకుడిగా, ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన గాయకుడిగా ఆయన చేసిన సేవలు అపారమైనవి. అలాంటి మహానుభావుడి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. సి.హెచ్. రామారావు దర్శకత్వంలో, అన్యుక్త్ రామ్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీమతి సి.హెచ్. ఫణి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఘంటసాల పాత్రలో గాయకుడు కృష్ణ చైతన్య నటించారు. జనవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? కథ ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

కథ

ఘంటసాల పాటలు వినని తెలుగు వారు ఉండరు. కానీ ఆయన పాటల వెనుక ఉన్న జీవిత పోరాటం, వ్యక్తిత్వం, మనసు గొప్పతనం గురించి తెలిసినవారు చాలా తక్కువ. అదే అంశాన్ని తెరపై ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఈ చిత్రం సాగుతుంది.

ఘంటసాల బాల్యం నుంచి సంగీతం నేర్చుకునేందుకు పడిన కష్టాలు, జోలె పట్టుకుని అడుక్కున్న రోజులు, అవమానాలు, మద్రాస్ వెళ్లి పార్కుల్లో పడుకున్న సందర్భాలు — ఇవన్నీ కథలో భాగం. నేలమీద నుంచి ఆకాశం వరకూ ఎదిగిన ఘంటసాల జీవితంలో ఉన్న లోటు ఏమిటి? చివరి రోజుల్లో ఆయనను కలచివేసిన బాధ ఏంటి? ఆయన చివరి కోరిక ఏమిటి? ఆ కోరిక నెరవేరిందా లేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

నటీనటులు

ఘంటసాల బాల్య పాత్రలో నటించిన బాల నటుడు అతులిత్ చక్కని నటనతో ఆకట్టుకున్నాడు. యవ్వన దశ నుంచి చివరి రోజుల వరకూ ఘంటసాల పాత్రను పోషించిన కృష్ణ చైతన్య, రూపంలోనూ నటనలోనూ ఘంటసాలనే గుర్తుకు తెచ్చేలా కనిపించారు. ఈ పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశారు.

పార్వతమ్మ పాత్రలో మృదుల సున్నితమైన అభినయం చూపించారు. బడే గులాం అలీ ఖాన్ పాత్రలో సుమన్ తన పరిధిలో మెప్పించారు. అలాగే ఘంటసాల గురువు పట్రాయని సీతారామ శాస్త్రిగా సుబ్బరాయ శర్మ, సముద్రాల రాఘవాచారిగా జె.కె. భారవి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ

ఘంటసాల జీవితాన్ని సినిమాగా మలచాలన్న దర్శకుడు సి.హెచ్. రామారావు ఆలోచనే అభినందనీయం. ప్రథమార్థంలో ఘంటసాల ఎదుర్కొన్న కష్టాలు, సంగీతం నేర్చుకునే క్రమంలో ఎదురైన అవమానాలు, ఆకలి బాధలను నిజాయితీగా చూపించారు. ఘంటసాలను వెంటాడే ఓ పీడకలతో ఇంటర్వెల్ పెట్టడం ఆసక్తిని పెంచుతుంది.

ద్వితీయార్థంలో ఘంటసాల వైభవం, ఆయన స్థాయి, గౌరవం చూపించారు. లతా మంగేష్కర్ ఆయనతో పాడాలని కోరడం, మహ్మద్ రఫీ ఆయన గాత్రాన్ని ప్రశంసించే సన్నివేశాలు బాగా పండాయి. బడే గులాం అలీ ఖాన్‌తో ఘంటసాల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని చూపిన సీన్లు హృదయాన్ని తాకుతాయి.

క్లైమాక్స్‌లో ఆయన గాత్రం మూగబోవడం, చివరి కోరిక నెరవేరకుండానే ఆయన కన్నుమూయడం వంటి సన్నివేశాలు భావోద్వేగంగా ప్రేక్షకులను కదిలిస్తాయి. ఘంటసాల జీవితాన్ని పూర్తిగా కాకపోయినా, కొంతవరకైనా తెలుసుకునేలా ఈ చిత్రం నిలుస్తుంది.

సాంకేతిక అంశాలు

ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ సంగీతమే. ఎక్కువగా ఘంటసాల పాడిన అసలు పాటలనే ఉపయోగించడం విశేషం. థీమ్ మ్యూజిక్, బడే గులాం అలీ ఖాన్ పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకెళ్తాయి.

కెమెరా వర్క్ కూడా పాతకాలపు వాతావరణాన్ని గుర్తుకు తెస్తుంది. అయితే వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కొంత బలహీనంగా అనిపిస్తాయి. ఆర్ట్ వర్క్ కూడా కొన్ని చోట్ల ఇబ్బంది కలిగిస్తుంది.

తుది మాట

సాంకేతికంగా అద్భుతమైన సినిమా కాకపోయినా, ఘంటసాల వెంకటేశ్వరరావు వంటి మహానుభావుడి జీవితాన్ని తెలుసుకునేందుకు ప్రతి తెలుగు వారు తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది.

రేటింగ్: 3/5 

Tags:    

Similar News