Love or Illusion: ప్రేమా లేదా భ్రమా? రిలేషన్‌షిప్‌లో కనిపించే ప్రమాదకర సంకేతాలు ఇవే
ప్రేమ అనేది జీవితాన్ని అందంగా మార్చే శక్తివంతమైన భావన. ఇద్దరి మధ్య నమ్మకం, అర్థం చేసుకునే గుణం, కష్టసుఖాల్లో తోడుగా ఉండే బంధం ఉంటే ఆ సంబంధం నిలకడగా ఉంటుంది.
Love or Illusion: ప్రేమా లేదా భ్రమా? రిలేషన్‌షిప్‌లో కనిపించే ప్రమాదకర సంకేతాలు ఇవే
ప్రేమ అనేది జీవితాన్ని అందంగా మార్చే శక్తివంతమైన భావన. ఇద్దరి మధ్య నమ్మకం, అర్థం చేసుకునే గుణం, కష్టసుఖాల్లో తోడుగా ఉండే బంధం ఉంటే ఆ సంబంధం నిలకడగా ఉంటుంది. అయితే చాలాసార్లు ప్రేమ అని అనుకునే కొన్ని భావోద్వేగాలు నిజానికి ప్రేమ కాకపోవచ్చు. ఆ తేడాను గుర్తించలేకపోతే తర్వాత కాలంలో భావోద్వేగంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ప్రేమలా కనిపించే కానీ నిజానికి భ్రమ మాత్రమే అయిన రిలేషన్‌షిప్ లక్షణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తాత్కాలిక భావోద్వేగాలు ప్రేమ కావు
ప్రేమ అవసరమే కానీ మీరు అనుభవిస్తున్న ప్రతి తీవ్ర భావోద్వేగం ప్రేమే అనుకోవడం పొరపాటు. కొందరు సందర్భాన్ని బట్టి ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోతారు. ఎదుటి వ్యక్తి పరిస్థితి చూసి అతిగా స్పందిస్తారు, అపారమైన ప్రేమ చూపించినట్లు ప్రవర్తిస్తారు. ఆ సమయంలో అన్ని విధాలా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇది చూసి ‘నిజంగా ఎంత ప్రేమ ఉందో!’ అని అనిపించవచ్చు.
కానీ ఆ సందర్భం పూర్తయిన తర్వాత మాత్రం అదే వ్యక్తి ఆసక్తి తగ్గిపోతుంది. ఇక పట్టించుకోరు. ఇది ప్రేమ కాదు, కేవలం తాత్కాలిక భావోద్వేగ స్పందన మాత్రమే. స్థిరత్వం లేని ఆలోచనలు, అతిగా జెలసీ, ఎమోషనల్ డ్రామా, ఓవర్‌వెల్మింగ్ ఫీలింగ్స్‌ని ప్యాషనేట్ లవ్ అని చాలామంది తప్పుగా భావిస్తారు. కానీ ఇవి మానసిక అలసటకు దారి తీస్తాయి. నిజమైన ప్రేమ గందరగోళంగా, బాధ కలిగించేలా ఉండాల్సిన అవసరం లేదు.
గిఫ్ట్‌లు, సర్‌ప్రైజ్‌లతోనే ప్రేమ కాదు
నిజమైన ప్రేమలో చిన్న చిన్న సర్‌ప్రైజ్‌లు ఉండొచ్చు. కానీ ప్రేమను నిరూపించడానికి ఎప్పుడూ గిఫ్ట్‌లు ఇవ్వడం, ఖరీదైన వస్తువులు కొనడం, గ్రాండ్ సెలబ్రేషన్లు చేయడం అవసరం లేదు. కొందరు పైపై ప్రేమ చూపించడానికి సర్‌ప్రైజ్‌లు, గిఫ్ట్‌లనే ఆయుధాలుగా వాడతారు.
సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో ప్రేమ అంటే అతి ప్రదర్శనలేనన్న భ్రమ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. నిజమైన ప్రేమ అనేది చూపుడుకాదు, అనుభూతి. ఎప్పుడూ కేర్ తీసుకోవడం, నమ్మకంగా ఉండటం, నిజాయితీగా మాట్లాడటం, కష్టసమయంలో పక్కన నిలబడటమే బంధాన్ని బలంగా ఉంచుతుంది.
సంబంధంలో వ్యక్తిత్వాన్ని కోల్పోవడం ప్రేమ కాదు
రిలేషన్‌షిప్‌లో ఉన్నాం కదా అని తనను తాను పూర్తిగా మార్చుకోవడం, వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టడం, నైతిక విలువలను త్యాగం చేయడం కొందరు మెచ్యూరిటీ లేదా సెల్ఫ్‌లెస్‌నెస్‌గా భావిస్తారు. కానీ వాస్తవానికి ఇది మెల్లగా అసంతృప్తికి, ఎమోషనల్ డిస్టెన్స్‌కు దారి తీస్తుంది.
ఆరోగ్యకరమైన సంబంధంలో ఇద్దరికీ వ్యక్తిగత స్పేస్ ఉంటుంది. మీ అభిప్రాయాలను, ఆసక్తులను అణిచివేయడం, మీపై నియంత్రణ చూపించడం, మీరే మిమ్మల్ని కోల్పోయేలా చేయడం ప్రేమ కాదు. అలాంటి సంబంధం మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.
నిబంధనలు విధించడం ప్రేమ కాదు
సమాజం, కుటుంబం లేదా సంస్కృతి పేరుతో కఠినమైన నిబంధనలు విధించడం, అవి తప్పనిసరిగా పాటించాలని బలవంతం చేయడం కూడా ప్రేమగా కొందరు భావిస్తారు. కానీ ఇది వ్యక్తిగత స్వేచ్ఛను, ఆసక్తులను దెబ్బతీస్తుంది.
రిలేషన్‌షిప్‌లో అనుకూలత అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం. ఒకే మోల్డ్‌లోకి బలవంతంగా తేవడం ప్రేమకు సంకేతం కాదు.
నిజాలను దాచడం కూడా ప్రేమ కాదు
అవతలి వ్యక్తి బాధపడతారేమోనన్న భయంతో ముఖ్యమైన విషయాలను మాట్లాడకుండా ఉండటం ప్రేమ కాదు. ఇది సమస్యలను మరింత పెద్దవిగా మారుస్తుంది. అలాగే మీ భావోద్వేగాలను అవతలి వ్యక్తే నియంత్రించడం, మీ అవసరాలను వారే నిర్ణయించడం ప్రేమగా అనిపించవచ్చు. కానీ ఇది మిమ్మల్ని ఎమోషనల్ డిపెండెన్సీలోకి నెడుతుంది.
సంబంధంలో కష్టమైన విషయాలను తప్పించుకోవడం మెచ్యూరిటీ కాదు. సమస్యలను ఓపెన్‌గా మాట్లాడకపోతే మనసులో కోపం, బాధ, అసంతృప్తి పేరుకుపోతాయి. ఉదాహరణకు, పార్ట్‌నర్ చేసిన తప్పును చెప్పకుండా మౌనంగా ఉండటం సమస్యను మరింత పెంచుతుంది. చివరికి ఇది సంబంధాన్ని బలహీనపరుస్తుంది.
చివరగా…
ప్రేమ అనేది భద్రత, గౌరవం, నమ్మకం, స్థిరత్వంతో ఉండాలి. బాధ, గందరగోళం, నియంత్రణ, భయం ఎక్కువగా ఉన్న సంబంధం ప్రేమ కాదు – అది భ్రమ మాత్రమే. ఆ తేడాను సమయానికి గుర్తిస్తే మీ మనసు, మీ జీవితం రెండూ సురక్షితంగా ఉంటాయి.