Knee Pain Causes: ఈ చిట్కాలతో మీ మోకాలి నొప్పికి చెక్ పెట్టండి..!
Knee Pain Causes: చాలా మంది తరచుగా మోకాలి నొప్పితో బాధపడుతుంటారు.
Knee Pain Causes: చాలా మంది తరచుగా మోకాలి నొప్పితో బాధపడుతుంటారు. మెట్లు ఎక్కేటప్పుడు, ఎక్కువసేపు నిలబడినప్పుడు లేదా ఉదయం నిద్ర లేవగానే కీళ్లు బిగుసుకుపోయినట్లు అనిపిస్తుందా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. ఈ నొప్పికి కేవలం వృద్ధాప్యం మాత్రమే కారణం కాదు, మీ శరీరంలో దాగున్న ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇంతకీ మోకాలి నొప్పికి కారణాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రధాన కారణాలు ఇవే..
ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. మోకాలి నొప్పి వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయని చెప్పారు.
1. విటమిన్ లోపాలు (Vitamin Deficiency)
నేటి బిజీ లైఫ్ స్టైల్ వల్ల మనం సరైన ఆహారం తీసుకోవడం లేదు, ఎండలో తిరగడం లేదు. దీనివల్ల శరీరంలో ముఖ్యంగా విటమిన్ డి (Vitamin D), కాల్షియం లోపిస్తున్నాయని చెబుతున్నారు. నిజానికి మన శరీరం కాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డి చాలా అవసరం. ఇది లేకపోతే ఎముకలు బలహీనపడి నొప్పి మొదలవుతాయని వెల్లడించారు. కాల్షియం తగ్గితే ఎముకల సాంద్రత తగ్గి, కీళ్లపై ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరించారు.
2. ఆర్థరైటిస్ (Arthritis/కీళ్ల వాతము)
ఆర్థరైటిస్ అనేది కీళ్లకు సంబంధించిన సమస్య. దీనివల్ల కీళ్ల మధ్య ఉండే మృదులాస్థి (Cartilage) క్రమంగా అరిగిపోతుంది. ఫలితంగా ఎముకలు ఒకదానికొకటి రుద్దుకుని వాపు, తీవ్రమైన నొప్పి వస్తాయి. ఇది వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్య అని చెప్పారు.
మీ మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి..
* ప్రతిరోజూ ఉదయం కనీసం 15-20 నిమిషాలు ఎండలో గడపండి. ఇది సహజంగా విటమిన్ డి అందిస్తుంది.
* పాలు, పెరుగు, గుడ్లు, ఆకుకూరలు, రాగులు వంటి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి.
* శరీర బరువు పెరిగితే ఆ భారం మోకాళ్లపై పడుతుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోండి.
* కీళ్ల కదలికల కోసం రోజూ తేలికపాటి వ్యాయామాలు లేదా వాకింగ్ చేయండి.
* ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల కీళ్లు బిగుసుకుపోతాయి. మధ్యమధ్యలో చిన్నపాటి విరామం తీసుకోండి.
మోకాలి నొప్పిని 'సాధారణ అలసట' అని వదిలేయకండి. అది విటమిన్ లోపం అయితే చిన్న జాగ్రత్తలతో నయం చేయవచ్చు, కానీ ఆర్థరైటిస్ అయితే వైద్యుల పర్యవేక్షణ అవసరం. నొప్పి తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.