సబ్జా గింజలతో సమ్మర్ లో వచ్చే సమస్యలకు చెక్‌

Update: 2019-05-15 12:55 GMT

ఎండ‌లు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల పగటిపూట కాలు బ‌య‌ట పెట్టాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఇది చాలదన్నట్టు అధిక వేడి, జ్వరం, చెమటకాయలు ఇలా ఎన్నో సమ్యలను సమ్మర్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాదు ఎండాకాలం వస్తే దాహం ఓ పట్టాన తీరదు. ఎన్ని నీళ్లు తాగినా, ఏం చేసినా నోరు ఎండిపోతూనే ఉంటుంది. చల్లగా ఉన్నవి ఏవైనా మళ్లీ మళ్లీ తాగాలని అనిపిస్తూ ఉంటుంది. మరి సమ్మర్ మనకు ఎదురయ్యే ఈ సమస్యలన్నింటికి చక్కని పరిష్కారం సబ్జా గింజలు... వీటిని నాన‌బెట్టి జెల్ గా మారిన తరువాత తిన్నా నీటితో కలిపి తాగినా ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతాయి.ఈ గింజలను నానబెట్టిన నీటిలో నిమ్మరసం, చ‌క్కెర వేసి కలిపి తాగిస్తే అజీర్తి సమస్య తీరుతుంది.. వీటి గుజ్జును పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష జ్యూస్‌లల్లో కలిపి పిల్లల కు తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ధనియాల రసంతో వీటిని కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుముఖం పడుతుంది.

బరువు తగ్గాలనుకనే వారు సబ్జాను నానబెట్టిన నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుంది. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

వేసవిలో వేడిని తగ్గించుకునేందుకు కూల్‌డ్రింకులు, ఎనర్జీ డ్రింకుల వంటివి తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. వాటి బదులు సబ్జా గింజల్ని తాగితే అన్నీ ప్రయోజనాలే. ఇంట్లో, ఆఫీస్‌లో, ప్రయాణాల్లో ఉన్నప్పుడు... ఎప్పుడైనా సరే... దాహం తీర్చడంలో సబ్జా గింజలు అద్భుతంగా పనిచేస్తాయి.

Similar News