కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిన గడ్డ..: జగన్

Update: 2019-03-22 14:36 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పులివెందుల వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్‌ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటా 49 నిమిషాలకు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. నామినేషన్ పత్రాలు సమర్పించే ముందు జగన్ సర్వమత ప్రార్ధనాలు నిర్వహించారు. జగన్ నామినేషన్ ర్యాలీకి వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. దాంతో పులివెందుల వీధులన్నీ జనమంద్రమయ్యాయి.

నామినేషన్ దాఖలుకు ముందు పులివెందుల సీఎస్‌ఐ చర్చి గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. నాన్నకు, నాకు పులివెందుల అంటే అమితమైన ప్రేమ. కడప గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నా పులివెందుల గడ్డపై పుట్టినందుకు ఇంకా గర్వపడుతున్నానన్న జగన్‌ కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిన గడ్డ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

కడప జిల్లాలో టీడీపీ గెలిచే పరిస్థితి లేకపోవడంతో చంద్రబాబు హత్యా రాజకీయాలకు తెరలేపారన్న జగన్‌ మరో 3రోజుల్లో కడప జిల్లా అంతటా హత్యలు, దారుణాలు చేయాలంటూ ఆదేశించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనను కూడా హత్య చేయాలని చూస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోవద్దని జగన్‌ కోరారు. జమ్మలమడుగుకు రాకుండా అడ్డుకునేందుకే చిన్నాన్నను చంపారని జగన్ చెప్పారు. మీ మధ్య నిల్చొని చెబుతున్నా మీ బాధలను నేను విన్నాను. మీ అందరికి అండగా నేనున్నానంటూ జగన్‌ భరోసా ఇచ్చారు. దేవుడిని నమ్ముతున్నా. ప్రజలపై ఆధారపడ్డా. ఎన్ని కుట్రలు పన్నినా వచ్చేది మాత్రం మనందరి ప్రభుత్వమేనని జగన్ ధీమా వ్యక్తంచేశారు. 

Similar News