ఆ ఇద్దరు మహిళల ఎంట్రీ పక్కా ప్లానా...శబరిమల దర్శనంలో కొత్త కోణం

ఇద్దరు మహిళల అయ్యప్ప ఆలయ దర్శనం వెనుక ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పక్కా ప్లాన్‌ ప్రకారమే ఆలయంలోకి ప్రవేశించారా? తెల్లవారుజామున హడావిడిగా ఎందుకు దర్శనం చేయించారు? భక్తుల్లేని సమయంలో ఎందుకు అనుమతి ఎందుకిచ్చారు? వీళ్లిద్దరూ ఆలయంలోకి ప్రవేశించడం వెనుక అసలేం జరిగింది?

Update: 2019-01-05 05:27 GMT
Sabarimala

ఇద్దరు మహిళల అయ్యప్ప ఆలయ దర్శనం వెనుక ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పక్కా ప్లాన్‌ ప్రకారమే ఆలయంలోకి ప్రవేశించారా? తెల్లవారుజామున హడావిడిగా ఎందుకు దర్శనం చేయించారు? భక్తుల్లేని సమయంలో ఎందుకు అనుమతి ఎందుకిచ్చారు? వీళ్లిద్దరూ ఆలయంలోకి ప్రవేశించడం వెనుక అసలేం జరిగింది?

యాభై ఏళ్లలోపు వయసున్న మహిళలకు శబరిమల అయ్యప్ప ఆలయంలోనికి ప్రవేశం నిషిద్ధం. అయితే ఆ సంప్రదాయానికి ముగింపు పలుకుతూ గతేడాది సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో అయ్యప్పను దర్శించుకునేందుకు ఎంతోమంది మహిళలు ప్రయత్నించారు. కానీ అడుగడుగునా అయ్యప్ప భక్తులు అడ్డుకోవడంతో ఎవరూ కూడా పంబను దాటి వెళ్లలేకపోయారు. కానీ ఈనెల రెండున తెల్లవారుజామున మూడు గంటల 45 నిమిషాలకు 40ఏళ్లలోపు వయసున్న ఇద్దరు మహిళలు ఈజీగా ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్పను దర్శించుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. హిందూసంస్థల ఆందోళనలతో కేరళ మొత్తం అట్టుడుకగా, దేశవ్యాప్తంగానూ తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ ఇద్దరినీ లోపలికి ఎవరు పంపించారు? భక్తులెవరూ అడ్డుకోలేదా? పక్కా ప్లాన్‌ ప్రకారమే దర్శనం చేయించారా? లాంటి ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకోవడం కేరళను అతలాకుతలం చేస్తుండగా, అసలు వీళ్లిద్దరూ మాల ధరించలేదని శబరిమల పరిరక్షణ సమితి ఆరోపిస్తోంది. కనీసం నుదుటన విభూది, కుంకుమ కూడా ధరించలేదని, మాలలో ఉన్నట్లు నటించి స్వామి సన్నిధికి వచ్చారని మండిపడుతున్నారు. అంతేకాదు ఆలయానికి వచ్చే కొన్ని గంటల ముందు వరకు సాధారణ దుస్తుల్లోనే ఉన్నారన్న వీడియో సాక్ష్యాన్ని శబరిమల పరిరక్షణ సమితి విడుదల చేసింది. శబరిమల ఆలయ ప్రవేశం కోసం వచ్చిన బిందు, కనకదుర్గలు డిసెంబర్ 31న ఓ హోటల్లో బస చేశారు. ఆ సమయంలో వీళ్లిద్దరూ సాధారణ దుస్తుల్లోనే ఉన్నారు. శబరిమల ఆలయానికి బయలుదేరడానికి ముందు కూడా హోటల్‌ రిసెప్షన్లో సాధారణ దుస్తుల్లోనే కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.

ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఈ ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారని శబరిమల పరిరక్షణ సమితి ఆరోపిస్తోంది. బిందు, కనకదుర్గ శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని, భక్తులు ఎవరూ అడ్డుపడకుండా పోలీసులు భారీ భద్రత కల్పించారని మండిపడుతున్నారు. డిసెంబర్ 24నే వీళ్లిద్దరూ ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, కానీ భక్తులు అడ్డుకోవడంతో ఈసారి ట్రాన్స్‌జెండ‌ర్ల మాదిరిగా నటించి అయ్యప్ప సన్నిధికి చేరుకున్నారని శబరిమల పరిరక్షణ సమితి ఆరోపిస్తోంది. మొత్తానికి శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడంపై కేరళలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. 

Similar News